ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ పేరిట ఇన్స్టాగ్రాంలో ప్రకటనలు ఇవ్వడం.. లాభాలు తెప్పిస్తామని చెప్పి లక్షల నుంచి కోట్లు పెట్టుబడి పెట్టించి బోర్డు ఎత్తేయడం. ఇదే ఈ గ్యాంగ్ పని. ఇలా వెయ్యి కాదు లక్ష కాదు.. ఏకంగా 26 కోట్ల రూపాయలకు పైగా స్కాం కు పాల్పడిన భారీ నెట్ వర్క్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు నిందితులను హైదరాబాద్ లో గురువారం (మార్చి 26) అరెస్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన ద్వారా యువతిని మోసం చేసి రూ.30 లక్షలు దోచుకుంది ఈ గ్యాంగ్. CloseX Pay, Trustly Pay, Accult Pay పేర్లతో నకిలీ పేమెంట్ గేట్‌వేలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. UPI, IMPS, కార్డ్ ట్రాన్సాక్షన్‌ల ద్వారా డబ్బుల మళ్లించి.. ప్రతి లావాదేవీపై 2–5 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నారు.
ఫేక్ కంపెనీల పేర్లతో మ్యూల్ ఖాతాలు సృష్టించి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. సూర్యోదయ బ్యాంక్ ద్వారా పేమెంట్ గేట్‌వే సేవల వినియోగంతో మొత్తం26,07,01,460 రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.
నిందితుల నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్ ఫోన్లు, 9 చెక్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. 6 లక్షల 50 వేల నగదు, షెల్ కంపెనీ స్టాంపులు సీజ్ చేశారు. ఇంకా ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
