బషీర్‌బాగ్, వెలుగు: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 24 ఏండ్ల యువతి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ యాడ్ చూసి, బెట్టింగ్ కోసం స్కామర్లను ఆశ్రయించింది. మొదట బోనస్, గెలిచిన నగదు విత్‌డ్రాకు యాక్సెస్ ఇవ్వడంతో నమ్మకం కలిగిన యువతి పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసింది.
నష్టపోతున్నప్పటికీ కుటుంబం అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో దాదాపు రూ.30 లక్షల వరకు డబ్బులు బెట్టింగ్ పెట్టింది. ఆ తర్వాత ఆమె అకౌంట్ ఫ్రీజ్ కావడంతో రూ.30 లక్షలు పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన రాజేశ్ వెంకట రామన్, భమిడి అభిషేక్, కేరళకు చెందిన అగస్టీన్ విలియమ్స్, గోవాకు చెందిన మన్మిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యాంక్ అధికారుల సహకారంతో దందా!
ప్రధాన నిందితుడైన రాజేశ్ వెంకట రామన్, గుజరాత్‌కు చెందిన జస్వంత్ రాయ్ గాంధీతో కలిసి ‘వన్ స్టాప్ షాపింగ్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను నడుపుతున్నాడు. ఈ పేమెంట్ లావాదేవీలు నిర్వహించడానికి అభిషేక్, అగస్టీన్‌లను నియమించుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆండీ అనే వ్యక్తి నకిలీ కంపెనీల పేరుతో మ్యూల్ అకౌంట్స్ తెరిచి, వాటి కేవైసీ కోసం గోవాకు చెందిన మన్మిత్‌కు పంపేవాడు. మన్మిత్ ఆ పేపర్స్‌ను అభిషేక్‌కు పంపగా, అభిషేక్ అహ్మదాబాద్‌లోని సూర్యోదయ బ్యాంక్ అధికారులకు పంపించేవాడు.
బ్యాంక్ అధికారులు 0.75 శాతం కమీషన్ తీసుకుని గేట్‌వే పేమెంట్ సేవలను అందించేవారు. ఇలా బెట్టింగ్ ద్వారా మోసం చేసి సంపాదించిన డబ్బు అంతా రాజేశ్ గేట్ వేలో డిపాజిట్ అయ్యేది. అనంతరం రాజేశ్, మన్మిత్ 5 శాతం కమీషన్ తీసుకుని, మిగిలిన డబ్బును ఆండీ అకౌంట్‌కు పంపేవారు. ఇలా ముఠాగా ఏర్పడి సుమారు రూ. 26.07 కోట్ల మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాలో ఆండీ, జస్వంత్ రాయ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్స్, 9 చెక్‌బుక్స్, 2 షెల్ కంపెనీ స్టాంప్స్, రూ. 6.5 లక్షల నగదును సీజ్ చేసి, వారిని రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.
