ఒక్క రోజులో 186 క‌రోనా కేసులు.. ల‌క్ష‌ణాలు లేకున్నా పాజిటివ్

ఒక్క రోజులో 186 క‌రోనా కేసులు.. ల‌క్ష‌ణాలు లేకున్నా పాజిటివ్

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులో 186 కొత్త కేసుల‌తో ఢిల్లీలో క‌రోనా బాధితుల సంఖ్య 1893కి చేరినట్లు తెలిపారు సీఎం కేజ్రీవాల్. శ‌నివారం పాజిటివ్ వ‌చ్చిన మొత్తం 186 మందికి ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని, వీరంతా అసింప్ట‌మేటిక్ గా ఉండ‌డం వ‌ల్ల వైర‌స్ సోకిన విష‌యం వారికి తెలియ‌ద‌ని చెప్పారు. ఇది ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని అన్నారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంద‌ని, అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని, ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని చెప్పారాయ‌న‌. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ క‌రోనా పేషెంట్ ఒక‌రితో తాను ఫోన్లో మాట్లాడాన‌ని, ఆ వ్య‌క్తి ప్ర‌భుత్వ ఫుడ్ డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్ లో వాలంటీర్ గా ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పాడ‌ని వివ‌రించారు. దీంతో ఆ సెంట‌ర్ కు వ‌చ్చిన‌వారికి, అక్క‌డ ప‌ని చేస్తున్న వారంద‌రినీ గుర్తించి ర్యాపిడ్ టెస్టులు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించాన‌ని తెలిపారు కేజ్రీవాల్. ప్ర‌స్తుతం ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్ డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపు లేద‌ని, ఏప్రిల్ 27న స‌మీక్షించి మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.