హైదరాబాద్‌లో రోజురోజుకు కల్తీ పెరిగిపోతుంది. ధనార్జనే లక్ష్యంగా కొందరు కల్తీ దందాకు తెరలేపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలైంది. గుట్టు చప్పుకుండా కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 1900 కిలోల కల్తీ అల్లం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం (మార్చి 6) లాలాపేటలోని ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌లో సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలాగూడ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, ఘటన స్థలం నుంచి మొత్తం 1,915 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 30 కిలోల ఎసిటిక్ యాసిడ్, 10 కిలోల శాంతన్ గమ్, 80 కిలోల ముడి అల్లం, వెల్లుల్లి, బ్రాండెడ్ లేబుల్స్, ప్యాకింగ్ మెషీన్లు, ఒక గ్రైండర్ సీజ్ చేశారు. చిన్నపాటి డ్రమ్‌లలో ఎటువంటి ప్యాకేజింగ్, లేబులింగ్ లేకుండా నిల్వ చేసిన 800 కిలోలకు పైగా పేస్ట్ గుర్తించారు.
నిందితులు అల్లం-వెల్లుల్లి పేస్ట్‌లో హానికర ఎసిటిక్ యాసిడ్ కలుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఎసిటిక్ యాసిడ్ కలిపిన అల్లం పేస్ట్‌ను ప్లాస్టిక్ టబ్‌లలో ఎక్కువసేపు నిల్వ చేసి ఆపై నకిలీ బ్రాండ్ లేబుల్‌లతో 175 గ్రాముల నుంచి 5 కిలోల వరకు అమ్ముతున్నారని వెల్లడించారు. ఈ కల్తీ అల్లం పేస్ట్ ను నగరంలోని జనరల్, కిరాణా విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
