22ఏ బాధితుల గోడు కలచివేస్తున్నది..30 శాతం కమీషన్ల కోసం సామాన్యులను వేధిస్తున్నరు: హరీశ్ రావు

22ఏ బాధితుల గోడు కలచివేస్తున్నది..30 శాతం కమీషన్ల కోసం సామాన్యులను వేధిస్తున్నరు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: బోడుప్పల్ పరిధిలో 30 ఏండ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్న ఇండ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందన్న విషయం తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్​ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన 22ఏ బాధితులు తమ గోడు చెప్పుకుంటుంటే కలచి వేసిందని శనివారం ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇండ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నారని మండిపడ్డారు.

దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22ఏ భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని, దీనికి రేవంత్ రెడ్డి సమాధానం ఏమిటని ప్రశ్నించారు. బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులెవరూ అధైర్యపడవద్దని, ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే మీ ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.