- 10 కిలోమీటర్ల జర్నీకి 32 నిమిషాలు
- కోటికి చేరువలో వాహనాలు
- వెహికల్స్‌కు తగ్గట్టు పెరగని రోడ్ నెట్‌వర్క్
- టామ్‌టామ్ ఇండెక్స్ షాకింగ్ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికీ పెరుగుతున్నాయి. సిటీలో ఎక్కడైనా.. ఏ టైమ్‌లో అయినా వెహికల్ తీసుకుని రోడ్డెక్కితే కొద్దిదూరం ప్రయాణానికి కూడా గంటలు పడుతున్నది. స్కూల్స్, ఆఫీసుల కెళ్లే పీక్ టైమ్‌లో గానీ, వాన పడ్డప్పుడు గానీ వెహికల్ స్పీడ్ గంటకు 10 నుంచి 15 కిలోమీటర్లు దాటడంలేదు.
హైదరాబాద్లో సగటున 10 కిలోమీటర్ల దూరానికి 32 నిమిషాలకు పైగా సమయం పడుతోందని తాజాగా ‘టామ్ టామ్ ఇండెక్స్’లో
వెల్లడైంది. ఇది భారతదేశంలోనే నాలుగో స్లో ట్రాఫిక్ టైమ్‌గా రికార్డయ్యింది. సిటీలో రోజుకు 3 వేలకు పైగా కొత్త వెహికల్స్ రోడ్లపైకి వస్తున్నాయి. దానికి తగ్గట్టు రోడ్ల అభివృద్ధి జరగకపోవడం, అడ్డగోలు వన్ వే నిబంధనలు, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్పాటించకపోవడం, ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం వల్ల ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నది.
ట్రాఫిక్ జామ్‌లతో టైమ్ వృథా..
హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగడం.. వలసలు పెరగడం .. నగరం అన్ని వైపులా వేగంగా విస్తరించడంతో వాహనాల రద్దీ కూడా పెరుగుతోంది. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం నుంచి రాత్రి ఇళ్లకు చేరే వరకు ప్రతి జంక్షన్ వద్ద ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ప్రముఖ గ్లోబల్ లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్ టామ్ విడుదల చేసిన ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం అత్యల్ప వాహన వేగం, అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న భారతీయ నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది.
ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి 32 నిమిషాల 37 సెకన్లు పడుతోంది. ఇదే 10 కిలోమీటర్ల ప్రయాణానికి బెంగుళూరులో 36 నిమిషాలు, కోల్‌కతాలో 35 నిమిషాలు, పుణెలో 33 నిమిషాలు పడుతోంది. అదే ముంబై లో కేవలం 28 నిమిషాలే. ప్రయాణ వేగం తగ్గిపోవడంవల్ల ఐటీ ఉద్యోగులు, నగర వాసులు ఏడాదికి సగటున 123 గంటల సమయాన్ని కోల్పోతున్నారు. హైదరాబాద్లో సగటు వాహన వేగం గంటకు 23 కిలోమీటర్లు కాగా పీక్ అవర్స్‌లో, వర్షం పడ్డప్పుడు 5 నుంచి 10 కిలోమీటర్లకు పడిపోతున్నది.
హైదరాబాద్ లో రోజుకు సుమారు 3 వేల వరకు కొత్త వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి. ఏటా 4 నుంచి 5 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2015–16లో 45 లక్షల వెహికిల్స్ఉండగా, ఇప్పుడు 90 లక్షలు దాటింది. ఇందుకు అనుగుణంగా రోడ్ల నెట్ వర్క్అభివృద్ధి జరగడంలేదు. పదేళ్లలో నగరంలో లింక్ రోడ్లు, అంతర్గత రోడ్లు కేవలం 4 నుంచి 6 శాతం మాత్రమే పెరిగాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మెగా సిటీ విస్తీర్ణంలో 15 నుంచి 18 శాతం రోడ్లు ఉండాలి. కానీ హైదరాబాద్‌లో రోడ్ల కవరేజ్ కేవలం 9.5 శాతం మాత్రమే ఉంది.
మెగాసిటీ పరిధిలో మొత్తం 9,013 కి.మీ రోడ్ల నెట్‌వర్క్ ఉంటే అందులో 6,167 కి.మీ సీసీ రోడ్లు కాగా, 2,846 కి.మీ బీటీ రోడ్లు ఉన్నాయి. ఇందులో 8 వేల కిలోమీటర్లకు పైగా గల్లీలు, కాలనీల్లోని అంతర్గత రోడ్లే. మూడు, నాలుగు లేన్లు ఉన్న ప్రధాన రహదారులు పొడవు కేవలం 812 కిలోమీటర్లే. ఇవికాక, ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డు158 కిలోమీటర్ల వరకు ఉంది. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల మేర కొత్తగా ప్రత్యామ్నాయ లింక్ రోడ్లను, మిస్సింగ్ లేన్లను నిర్మించారు. గత నాలుగేళ్లలో 15 కొత్త ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, అండర్‌పాస్‌లు నిర్మించారు. ప్రస్తుతం రూ. 7,032 కోట్లతో ‘హెచ్ సిటీ’ప్రాజెక్ట్ కింద మరికొన్ని కొత్త ఫ్లై ఓవర్ల పనులు సాగుతున్నాయి. కొత్తరోడ్లు, ఉన్న రోడ్ల విస్తరణకు భూసేకరణ పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లపై ఫోకస్ పెడుతున్నారు.
అడ్డదిడ్డంగా ప్రజా రవాణా వ్యవస్థ
హైదరాబాద్లో 25 బస్ డిపోల నుంచి నడుస్తున్న 3,500 ఆర్టీసీ బస్సుల్లో 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రోరైల్ ద్వారా 5 లక్షలు, ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా 60 వేల నుంచి లక్ష మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఈ మూడింటి మధ్య సరైన సమసన్వయం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైల్ మూడు కారిడార్లలో కలిపి దాదాపు 55కి పైగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ 800 నుంచి వెయ్యి ట్రిప్పులు నడుస్తున్నాయి. రాయదుర్గ్, హైటెక్ సిటీ స్టేషన్లలో మంగళ, బుధ, గురువారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. సిటీలో వాన పడితే మెట్రో ట్రైన్లో అడుగు పెట్టడానికి వీలుండదు. మెట్రో దిగగానే ఆర్టీసీ బస్సు ఎక్కే సదుపాయం ఉండాలి.
కానీ మెట్రో దిగిన తర్వాత ఆఫీసులకు గానీ, ఇండ్లకు గానీ వెళ్లడానికి షేర్‌ఆటోలు, ఈ- రిక్షాలు, బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు బైకులు, కార్లు వాడాల్సివస్తోంది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్ టికెట్చాలా చౌక. రూ.5 నుంచి 15లకే 90 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఆరు రూట్లలో రోజు 80 నుంచి 133 వరకు సర్వీసులు నడుస్తున్నాయి. అయినా వీటికి పెద్దగా ఆదరణ లేదు. ముంబై, ఢిల్లీ మహానగరాల్లో రోజుకు కోటి మందికి పైగా ప్రయాణిస్తుంటారు. కానీ హైదరాబాద్లో ట్రైన్ టైమింగ్స్ సరిగ్గా పాటించకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్య లక్ష కూడా చేరడం లేదు. రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచితే ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించక..
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. యూ-టర్న్ దూరంగా ఉందంటూ రాంగ్ సైడ్‌లో రావడంతో ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. కూకట్‌పల్లి వై జంక్షన్, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లు, ఉప్పల్- బోడుప్పల్ రోడ్డు, పాతబస్తీ, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 12 తదితర చోట్ల ఈ సమస్య ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎడమ వైపు వాహనాలు సాఫీగా వెళ్లేందుకు ఫ్రీ లెఫ్ట్ సౌకర్యాన్ని కల్పించినా ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఆ మార్గాన్ని బ్లాక్ చేస్తున్నాయి. దీంతో ఎడమ వైపు వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతున్నది.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, కోకాపేట, సైబరాబాద్ తదితర ప్రాంతాల్లో తక్కువ ఏరియాలో ఎక్కువ హైరైజ్బిల్డింగులు, కార్పొరేట్ ఆఫీసులు ఉండడం వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటున్నది. బయో డైవర్సిటీ జంక్షన్, పంజాగుట్ట, మైత్రివనం, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది.
ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచాలి
సిటీలో నిర్మించే ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ లవల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. సింగపూర్, లండన్ తరహాలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే శాశ్వత పరిష్కారం వస్తుంది. ప్రయాణికులు కూడా ప్రజా రవాణా వినియోగించుకోవాలి. - హరిశంకర్ బాబు, బంజారా హిల్స్
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్లకు కఠిన శిక్షలు అమలు చేయాలి
రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలకు ప్రమాదం. రాంగ్రూట్లో వచ్చి గుద్దితే సరిగ్గా వస్తున్న వాళ్లు కూడా యాక్సిడెంట్లకు గురై నష్టపోతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలాంటి వాళ్లను జైళ్లలో వేయాలి.
- సండ్ర గోపి, అమీర్ పేట్, హైదరాబాద్
మెట్రో రైల్ బోగీలు పెంచాలి
ప్రస్తుతం నడుస్తున్న మూడు రూట్లలో పీక్ అవర్స్‌లో మెట్రో రైల్ బోగీలు పెంచాలి. ఇప్పు డు కేవలం మూడు బోగీలు మాత్రమే ఉన్నాయి. ఆరు బోగీలకు పెంచితే మరో ఐదారు లక్షల మంది ప్రయాణీకులకు మేలు జరుగుతుంది. రద్దీ వల్ల మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- కె.స్వాతి, ఐటీ ఎంప్లాయ్, హైటెక్ సిటీ
ఆ టైమ్‌లో అడుగుపెడ్తే అంతే..
ఐటీ జోన్ అయిన వెస్ట్రన్ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36, 45 ఏరియాలో ఆఫీసులకు చేరుకునే వేళలైన ఉదయం 9 నుంచి11:30 వరకు, ఆఫీసునుంచి ఇళ్లకు వెళ్లే వేళలైన సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు రద్దీ బాగా ఉంటోంది. కోర్ సిటీగా పిలిచే పాతబస్తీ జోన్లో అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, చార్మినార్, బహదూర్‌పురా ఏరియాలో వాణిజ్య సంస్థలు ఆలస్యంగా తెరుచుకోవడం వల్ల మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 వరకు విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఈస్ట్రన్ అండ్ నార్తర్న్ కారిడార్‌లోని ఉప్పల్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్ ఏరియాలో ఉదయం 8 నుంచి 10:30 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9:30 వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటోంది.
