ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తే సామూహిక అత్యాచారం

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తే సామూహిక అత్యాచారం

ఢిల్లీలో దారుణం జరిగింది. ఫేస్‌‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని కలవాడినికి వెళ్లిన యువతిపై 25 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలో డొమెస్టిక్ స్టాఫర్‌గా పనిచేస్తున్న యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా హోడాల్‌కు చెందిన సాగర్ (23) అనే యువకుడు పరిచయమయ్యాడు. వారిద్దరూ తమతమ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా కొన్నాళ్లు మాట్లాడుకున్న తర్వాత సాగర్.. యువతికి పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అందుకు అంగీకరించిన యువతిని.. తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని, హోడాల్‌కు రావాల్సిందిగా కోరాడు. దాంతో యువతి మే 3న సాగర్‌ను కలవడానికి హోడాల్‌కు వెళ్లింది. యువతిని పికప్ చేసుకున్న సాగర్.. రామ్‌ఘర్ గ్రామానికి సమీపంలోని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ సాగర్ సోదరుడు, వారి స్నేహితుల బృందం మద్యం సేవిస్తూ ఉన్నారు.

తాగిన మత్తులో వారంతా.. యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ రాత్రంతా యువతిని అక్కడే ఉంచుకొని.. మరుసటి రోజు ఆకాష్ అనే స్ర్కాప్ డీలర్ వద్దకు తీసుకెళ్లి అప్పగించారు. అక్కడ ఆకాష్ తన నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. రెండు రోజులుగా పదేపదే లైంగిక వేధింపులు జరగడంతో యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దాంతో ఆకాష్ ఆ యువతిని బదర్‌పూర్ సరిహద్దులో వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్థానికుల సాయంతో ఎలాగో అలాగా ఇంటికి చేరుకుంది. తొమ్మిది రోజుల తర్వాత కోలుకున్న యువతి.. మే 12న హసన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేసింది. అనారోగ్యం కారణంగా ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆ యువతి పోలీసులకు తెలిపింది. యువతి ఫిర్యాదు మేరకు సాగర్‌ను అరెస్ట్ చేసి.. మిగతా వారికోసం గాలింపు చేపట్టినట్లు ఎస్‌హెచ్ఓ రాజేష్ తెలిపారు. నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.