లాక్ డౌన్ ఎఫెక్ట్..2.5 కోట్ల మంది ఫోన్లు పనిచేయట్లే

లాక్ డౌన్ ఎఫెక్ట్..2.5 కోట్ల మంది ఫోన్లు పనిచేయట్లే

న్యూఢిల్లీ:  కరోనా లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా రెండున్నర కోట్ల మంది ఇండియన్ల వద్ద మొబైల్ ఫోన్లు లేకుండా పోయాయని హ్యాండ్‌సెట్‌ తయారీదారులు చెప్పారు. సప్లయి చెయిన్‌లో ఇబ్బందులతో కాంపోనెంట్లు దొరకడం లేదని, దీంతో ఫోన్లు పనిచేయడం లేదని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) అంచనావేసింది. ఒకవేళ హ్యాండ్‌సెట్లు, వాటి స్పేర్‌‌ పార్ట్ ల అమ్మకం మీద ఆంక్షలు ఇలానే కొనసాగితే.. మే చివరి నాటికి దేశంలో పనిచేయని హ్యాండ్‌సెట్లు ఉన్న మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 4 కోట్లకు పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఈ లాక్‌డౌన్ కాలంలో నిత్యావసర వస్తువులు, సేవలు మినహాయించి ఎలాంటి వస్తువు అమ్మడానికి వీలులేదని అంతకుముందే ప్రభుత్వం చెప్పింది. తాజాగా రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న షాపులు తెరుచుకునేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టెలికాం, ఇంటర్నెట్ బ్రాడ్‌కాస్ట్,  ఐటీ సర్వీసుల ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కానీ మొబైల్ డివైజ్‌ల షాపులు క్లోజయ్యాయి.

అత్యవసర సర్వీసుల కిందకు తేవాలి…

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల అమ్మకానికి, సర్వీసులకు కూడా అనుమతించాలని, వీటిని అత్యవసర సర్వీసుల కిందకు తీసుకురావాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ), ఐసీఈఏ కోరుతున్నాయి. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్ట్రీ కూడా ల్యాప్‌టాప్స్‌, మొబైల్ డివైజ్‌లను అత్యవసర వస్తువుల కేటగిరీ కిందకు తీసుకురావాలని హోమ్ మినిస్ట్రీకి ప్రతిపాదించింది. కరోనా వైరస్‌ను రాకుండా అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ కూడా ప్రస్తుతం ఆరు కోట్ల స్మార్ట్ ఫోన్లలో రన్ అవుతోంది. ఆరోగ్య సేతు యాప్ కోసం ప్రజలు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లలోకి అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్నారని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహీంద్రో చెప్పారు. కాగా, 2019–20లో మొబైల్ ఫోన్ ప్లేయర్లు రూ.25 వేల కోట్ల విలువైన డివైజ్‌లను ఎక్స్ పోర్ట్ చేశారు. ప్రొడక్షన్ ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లను క్రాస్ చేసింది. లాక్‌డౌన్ కారణంతో మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ సుమారు రూ.15 వేల కోట్లు నష్టాలు పాలైనట్టు అంచనాలున్నాయి.