హైదరాబాద్: మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని మంత్రి సీతక్క అన్నారు. వారిని ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ ఆర్ధిక సాక్షరత సదస్సులో మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని ఆవిష్కరించారు. 46.68 లక్షల మంది మహిళలు 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సా ధికారతకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. గడిచిన రెండేండ్లలో మహిళా సంఘాలకు రూ.35.435 కోట్ల బ్యాంకింగ్ రుణాల మంజూరు చేశామన్నారు.
ఇందిరా మహిళా శక్తితో 2.05 లక్షల సూక్ష్మ వ్యాపారాలను మహిళా సంఘాలు స్థాపించాయని చెప్పారు. సమ్మక్క, సారలమ్మ జాతరలో ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళా సంఘాలకు రూ.3.5 కోట్లు లాభాలు వచ్చాయన్నారు. వారికి స్థిరమైన ఆదాయం కల్పించేందుకు ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. జీడీపీలో మన దేశ మహిళల భాగస్వా మ్యం 18 శాతమే నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 40 శాతంగా ఉందన్నారు. మంత్రి సీతక్క ప్రసంగాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశంసించారు.
