30 శాతం బైకర్లు హెల్మెట్లు పెట్టట్లే.. సైబరాబాద్ సీపీ రమేశ్ అసహనం

30 శాతం బైకర్లు హెల్మెట్లు పెట్టట్లే.. సైబరాబాద్ సీపీ రమేశ్ అసహనం
  • ఐకియా జంక్షన్ వద్ద ఆకస్మిక తనిఖీ

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో ప్రయాణించే పలువురు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని సైబరాబాద్ సీపీ డా.ఎం. రమేశ్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఐకియా క్రాస్ రోడ్డు వద్ద సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య​అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఐకియా జంక్షన్ వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో 30 శాతం మంది బైకర్లు అసలు హెల్మెట్లే ధరించడం లేదని, 50 శాతం మంది హెల్మెట్ పెట్టుకున్నా స్ట్రాప్స్ (పట్టీలు) బిగించుకోవడం లేదని సీపీ గుర్తించారు. అలాగే పాదచారులు జీబ్రా క్రాసింగ్ వాడకుండా అడ్డదిడ్డంగా రోడ్డు దాటడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించారు.

ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చోట్ల 50 మీటర్ల ముందే జీబ్రా క్రాసింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నేటి నుంచి ఐటీ కారిడార్​లో హెల్మెట్ ధరించని వారు, పట్టీలు బిగించుకోని వాహనదారులే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులకు సూచించారు.