V6 News

15 ఏళ్ల బాలిక అబార్షన్ కేసు.. కేంద్రంపై మండిపడ్డ సుప్రీం కోర్టు.. మీ చట్టం మార్చండని వ్యాఖ్య

15 ఏళ్ల బాలిక అబార్షన్ కేసు.. కేంద్రంపై మండిపడ్డ  సుప్రీం కోర్టు.. మీ చట్టం మార్చండని వ్యాఖ్య

15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేప్ కు గురై.. 30 వారాల ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతున్న బాధితురాలి అబార్షన్ ను అడ్డుకోవాలని చూడటంపై కేంద్రంతో పాటు ఎయిమ్స్ (AIIMS) ను తీవ్రంగా మందలించింది. అబార్షన్ అనేది బాధితురాలు, ఆమె కుటుంబ నిర్ణయమని.. ఈ విషయంలో అడ్డుకోవాలని చూడటం తగదని మండిపడింది. ఈ విషయంలో పాత చట్టాన్ని మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

జస్టిస్ సుర్యకాంత్, జస్టిస్ జోమల్య బాగ్చి లతో కూడిన ధర్మాసనం.. 2026 ఏప్రిల్ 30వ తేదీన ఈ కేసును విచారిస్తూ కీలక వ్యఖ్యలు చేశారు. రేప్ కు గురైన బాధితుల విషయంలో అడ్డుపడుతున్న పాత చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాలానికి అనుగుణంగా చట్టాలు మారాల్సిన అవసరం ఉందన్నారు న్యాయమూర్తులు. 

రేప్ బాధితురాలు అనుభవిస్తున్న బాధను ఏ పరిహారం ఇచ్చినా సరిపోదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఐశ్వర్య భాతీ ని ఉద్దేశించి..  పౌరులకు గౌరవం ఇవ్వాలి మేడం.. టర్మినేషన్ (అబార్షన్) ఆర్డర్ ను అడ్డుకోడానికి మీకెలాంటి అర్హత లేదు.. అది బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవాల్సిన అంశం.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము పౌరుల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తాం.. మీరు ఇస్తున్నారా.. అంటూ ప్రశ్నించారు. 

కోర్టు ఆగ్రహానికి కారణం:

ప్రభుత్వంపైన కోర్టు ఆగ్రహానికి కారణం.. బాధితురాలి అబార్షన్ అడ్డుకోవాలనే వాదన. అటార్నీ జనరల్ కోర్టుతో వాదిస్తూ.. బాధితురాలికి ప్రస్తుతం 30 వారాల గర్భం ఉందని.. ఈ సమయంలో తొలగించడం వైద్య పరంగా వీలుకాదని వాదించారు. ప్రస్తుతం గర్భాన్ని క్యారీ చేసి శిశువుకు జన్మనివ్వాల్సిందేనని.. మరో మార్గం లేదని ప్రభుత్వం తరఫున అన్నారు. 

ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇంత బాధ అనుభవిస్తున్న అత్యాచార బాధితురాలైన మైనర్ సంతానం విషయంపై ప్రభుత్వం కలుగజేసుకోవడం సరికాదని ఆక్షేపించింది. ఈ విషయంలో పాత చట్టాన్ని మార్చుకోవాలని సూచించింది.