1582 చదరపు కిలోమీటర్లు.. 210 మీటర్ల మందం.. 31,500 టన్నుల ఐస్.. ఒక్క మాటలో చెప్పాలంటే లండన్ అంత పెద్ద ఐసు కొండ. అంటార్కిటికాలోని ఆ ఐస్ కొండ కొద్ది రోజుల క్రితం కుప్పకూలిపోయింది. అమెరీ ఐస్ షెల్ఫ్‌లో ఉండే ఆ కొండను డీ28 అని పిలుస్తున్నారు. సెప్టెంబర్ 25న విరిగిన ఆ ఐస్ బర్గ్ సముద్రంలో కలిసిపోయింది. అయితే, అది ఎప్పుడూ జరిగే ప్రక్రియేనని సైంటిస్టులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతో దానికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ‘‘అంకెల్లో చూడ్డానికి అది చాలా పెద్దగానే కనిపిస్తుంది. కానీ, ఐస్‌బర్గ్‌లు తయారు కావడం, అవి కూలిపోవడం ఎప్పుడూ జరిగేదే” అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ హెలెన్ అమాండా ఫ్రికర్ అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లో కరుగుతున్న ఐస్‌కు, దీనికి సంబంధం లేదన్నారు. అక్కడ పూర్తిగా వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఐస్ కరుగుతోందని, ఇది సహజంగా జరుగుతున్న పరిణామమని వివరించారు. బరువును సమతూకంగా ఉంచుకోవడంలో భాగంగానే ఇది జరుగుతుందన్నారు.
