- ఆటో క్యాన్సలేషన్తో జర్నీ చేయలేకపోయిన ప్రయాణికులు
- ప్రతి సెకనుకు కన్ఫర్మ్ డ్ చాన్స్ కోల్పోయిన ఒక ప్యాసింజర్
- రైల్వే ఉద్యోగి ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి..
న్యూఢిల్లీ: దేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 3.39 కోట్ల మంది రైల్లో ప్రయాణించే అవకాశాన్ని కోల్పోయారు. అంటే ప్రతి సెకనుకు ఒక ప్యాసింజర్ చివరి క్షణంలో రైలు ఎక్కే చాన్స్ మిస్సయ్యాడు. చార్ట్ ప్రిపరేషన్ టైంలో వెయిట్ లిస్టెడ్ టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడం లేదా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ కావడంతో 3.39 కోట్ల ప్రయాణికులకు రైల్లో ప్రయాణించే అవకాశం అందకుండా పోయింది. మధ్యప్రదేశ్ లోని నీమచ్ కు చెందిన రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ గౌర్ వేసిన ఆర్టీఐ దరఖాస్తుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బాధితుల్లో ఎక్కువ మంది స్లీపర్ క్లాస్, 3ఏసీ ప్యాసింజర్లు ఉన్నారు. టికెట్లు క్యాన్సిల్ అవడం, కన్ఫర్మ్ కాకపోవడం వంటి కారణాలతో ఆ ఆర్థిక సంవత్సంలో రోజుకు 92,877 మంది, ప్రతి గంటకు 3,870, ప్రతి నిమిషానికి 64, ప్రతి సెకనుకు ఒకరి కన్నా ఎక్కువ మంది ప్యాసింజర్లు ట్రైన్ జర్నీ మిస్ అయ్యారు. 2021–22లో ఇవే కారణాల వల్ల 1.65 కోట్ల మంది ప్రయాణికులు రైలు జర్నీ మిస్ అవగా.. 2022–23లో ఈ సంఖ్య 2.72 కోట్లకు పెరిగింది. అలాగే, 2023–24లో 2.96 కోట్ల మంది, 2024–25లో 3.27 కోట్ల మంది, 2025–26 లో 3.39 కోట్ల మంది ప్రయాణికులు రైలెక్కే అవకాశాన్ని కోల్పోయారు.
స్లీపర్ క్లాస్ బాధితులు 1.68 కోట్లు
నిరుటి ఆర్థిక సంవత్సరంలో రైలు జర్నీ మిస్సయిన అన్ని కేటగిరిల్లో స్లీపర్ క్లాస్ బాధితులే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం 1.68 కోట్ల మంది స్లీపర్ క్లాస్ ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. సాధారణంగా స్లీపర్ క్లాస్ లో అత్యంత ఎక్కువగా జర్నీ చేస్తుంటారు. వారిలో వలస కూలీలు, స్టూడెంట్లు, తక్కువ ఆదాయం పొందేవారు వంటి ప్రయాణికులు ఉంటారు. స్లీపర్ క్లాస్ తర్వాత 3ఏసీ కేటగిరి ప్రయాణికులు బాధితులుగా మిగిలారు. మొత్తం 74.55 లక్షల మంది రైల్ జర్నీ మిస్సయ్యారు. అలాగే, 2ఏసీ ప్రయాణికులు కూడా రైలు ఎక్కలేకపోయారు.
ఎన్నో జీవితాలు తారుమారు
చివరి క్షణంలో రైలు జర్నీ క్యాన్సిల్ కావడంతో ఎంతో మంది జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ‘‘రైలు టికెట్ క్యాన్సిల్ అయితే రిఫండ్ చేయడం పరిష్కారం కాదు. ఎంతోమంది తాము ప్రయాణించాల్సిన రోజు ఎన్నో ముఖ్యమైన పనులకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోజు స్టూడెంట్లకు పరీక్షలు ఉండవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. కొంతమంది పెండ్లిండ్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుంది” అని ఆర్టీఐ యాక్టివిస్ట్ చంద్రశేఖర్ గౌర్ అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు అయినా కూడా ఏటా కోట్ల మంది ప్రయాణికులకు చివరి క్షణంలో రైలు జర్నీ క్యాన్సిల్ కావడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆయన చెప్పారు. ‘‘రైళ్లను ఆధునీకరిస్తున్నాం. మౌలిక సదుపాయాలు పెంచుతున్నాం. వేగవంతమైన రైళ్లు నడుపుతున్నాం అంటే సరిపోదు. ప్రయాణికులు రైలు మిస్ కాకుండా చూసుకోవాలి” అని ఆయన సూచించారు.
