కారు ఆగి ఉంది.. అందులోనూ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న కారు.. అలాంటి కారులో ఎయిర్ బ్యాగ్ పేలింది. ఇప్పుడు ఈ ఘటన వాహనదారులను షాకింగ్ కు గురి చేస్తోంది. ఎయిర్ బ్యాగ్ అంటే.. రన్నింగ్ లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు.. బలంగా మరో వాహనాన్ని ఢీకొన్నప్పుడు.. వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాకుండా కాపాడుతుంది. మరి అలాంటి ఆప్షన్ ఉన్న ఎయిర్ బ్యాగ్.. పార్క్ చేసి ఉన్న కారులో ఎయిర్ బ్యాగ్స్ పేలి.. 25 ఏళ్ల యువకుడు చనిపోవటం ఇప్పుడు వాహనదారులు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.
అతని పేరు మోహిత్ సురేష్ సోని. వయస్సు కేవలం 25 ఏళ్లు. కార్ డీలర్‌గా పనిచేస్తూ భవిష్యత్తును నిర్మించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం మోహిత్‌కు ఒక హోండా కారును వేరే ఒకరికి అమ్మే డీల్ కుదిరింది. కారును అవతలి వారికి అప్పగించే ముందు, అంతా బాగుందో లేదో ఒకసారి స్వయంగా చెక్ చేయాలనుకున్నాడు. రోడ్డు పక్కన కారును పార్క్ చేసి, లోపల కూర్చుని స్టీరింగ్, ఇతర భాగాలను పరిశీలిస్తున్నాడు. కానీ, సరిగ్గా అదే క్షణంలో ఊహించని ఘోరం జరిగిపోయింది.
రెప్పపాటులో ముగిసిన కథ
కారు ఎక్కడా ఢీకొట్టలేదు, అసలు కదలకుండా ఒకే చోట ఆగి ఉంది. అయినా సరే.. సాంకేతిక లోపం వల్ల స్టీరింగ్ వీల్‌లోని ఎయిర్‌బ్యాగ్ అకస్మాత్తుగా, అత్యంత వేగంతో పేలింది. ఆ ఎయిర్‌బ్యాగ్‌ను కప్పి ఉంచే గట్టి ప్లాస్టిక్ కవర్ బుల్లెట్‌లా దూసుకొచ్చి మోహిత్ మెడ కుడిభాగానికి బలంగా తగిలింది. అరసెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఇంపాక్ట్‌కు మెడ భాగం తీవ్రంగా గాయపడి, రక్తం ధారలా కారిపోయి.. కారులోనే మోహిత్ స్పృహ తప్పి పడిపోయాడు.
అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని భాయందర్‌లోని పండిట్ భీమ్‌సేన్ జోషి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ప్రాణం పోయింది. మోహిత్ ఆసుపత్రికి చేరకముందే కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
15 ఏళ్ల పాత కారు.. ఎక్కడ లోపం జరిగింది?
పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ హోండా కారు దాదాపు 15 ఏళ్ల నాటి పాత వాహనం. అయిన దానికి వాలిడిటీ అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారుకు బయటి నుంచి ఎలాంటి డ్యామేజ్ లేదు.
అసలు కారు కదలకుండా పార్క్ చేసి ఉన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్ ఎందుకు పేలింది ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం కారులోని రక్త నమూనాలను సేకరించింది. కారు ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్‌లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలించాల్సిందిగా ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ను పోలీసులు కోరారు. గతంలో ఈ కారుకు ఎలాంటి హిస్టరీ ఉందో తెలుసుకోవడానికి పాత ఓనర్ కోసం కూడా వెతుకుతున్నారు.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం
ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే శవమై మారడంతో మోహిత్ కుటుంబం తట్టుకోలేకపోతోంది. అసలు కారు నడపకుండా, పార్క్ చేసిన చోటే ప్రాణాలు ఎలా పోతాయని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాన్ని తేల్చాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబికులు డిమాండ్ చేస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే... ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుల ప్రాణాలు కాపాడటానికి ఎయిర్‌బ్యాగులు అత్యంత వేగంతో తెరుచుకునేలా డిజైన్ చేస్తారు. కానీ, పాత వాహనాల్లో లేదా సెన్సార్ల లోపం వల్ల ఇవి అనుకోకుండా పేలితే.. ఆ ఒత్తిడికి ప్రాణాంతక గాయాలు అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత కార్లను కొనేటప్పుడు, వాడేటప్పుడు ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ను కూడా చెక్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
