ఆరోగ్యంగా మారడం అంటే జీవితాన్ని ఒకేసారి మార్చేయడం కాదు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని మధ్యలోనే వదిలేయడం కంటే, నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న మార్పులే లాంగ్ రన్‌లో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కేవలం ఒక నెల రోజుల్లోనే మీ ఫిట్‌నెస్, నిద్ర, బరువు, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడే 7 సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
1. టైమ్ పెట్టకుండానే.. శారీరక శ్రమ
ఆరోగ్యంగా ఉండటానికి జిమ్‌కి వెళ్లి గంటలు గంటలు చెమటోడ్చాల్సిన పనిలేదు. మీ ప్రతిరోజు పనుల్లోనే చిన్న చిన్న కదలికలను పెంచండి.
*లిఫ్ట్‌కి బదులు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి.
*ఆఫీసులో లంచ్ బ్రేక్ తర్వాత కాసేపు నడవండి.
*బైక్ లేదా కార్ పార్కింగ్‌ను ఎంట్రన్స్‌కు కొంచెం దూరంగా పార్క్ చేసి, నడుచుకుంటూ వెళ్ళండి.
*ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అటుఇటు తిరగండి.
2. రోజూ సరిపడా నీరు
మన శరీరంలో సుమారు 60 శాతం నీరే ఉంటుంది. కాబట్టి బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. చాలామంది వృద్ధులలో దీర్ఘకాలిక డీహైడ్రేషన్ సమస్య కనిపిస్తుంటుంది.
*కూల్‌డ్రింక్స్, సోడాలకు బదులుగా మంచి నీటిని తాగడం అలవాటు చేసుకోండి.
*ఎక్కడికి వెళ్లినా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి.
*రోజుకు కనీసం 6 నుండి 8 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోండి.
3. ప్రశాంతమైన నిద్ర.. అన్నింటికీ మందు
మంచి నిద్ర మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని ఇస్తుంది ఇంకా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా నిద్ర చాలా ముఖ్యం.
*రాత్రిపూట కాఫీ, టీలు తాగడం మానేయండి.
*పడుకునే కనీసం ఒక గంట ముందు ఫోన్లు, టీవీలు పక్కన పెట్టేయండి.
*పడకగది చీకటిగా, ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోండి.
4. ప్లేటు నిండా పండ్లు, కూరగాయలు
మీరు తినే భోజనంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్‌ను అందిస్తాయి.
*జంక్ ఫుడ్‌కు బదులుగా పండ్లను స్నాక్స్‌లా తీసుకోండి.
*వంటల్లో కూరగాయల పరిమాణాన్ని పెంచండి.
*స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లకు బదులుగా చాక్లెట్ పూత పూసిన ఫ్రూట్ డెజర్ట్స్ వంటి ఆరోగ్యకరమైన అల్టార్నేటివ్స్ తీసుకొండి.
5. చూస్తూ, ఆస్వాదిస్తూ తినండి
టీవీ చూస్తూనో, ఫోన్ స్క్రోల్ చేస్తూనో అలసత్వంగా తినొద్దు. మీరు తినే ఆహారం రుచి, వాసన, ఆకృతిని గమనిస్తూ నిదానంగా తినండి. ఇలా చేయడం వల్ల ఎంత తినాలో బాడీకి కరెక్ట్‌గా తెలుస్తుంది, జీర్ణక్రియ బాగుంటుంది ఇంకా అమితంగా తినే అలవాటు తగ్గుతుంది.
6. పడుకునే ముందు స్క్రీన్ టైమ్
ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల నుండి వచ్చే 'బ్లూ లైట్' మన మెదడును మేల్కొని ఉండేలా చేస్తుంది. దీనివల్ల నిద్రకు కారణమయ్యే 'మెలటోనిన్' హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రి త్వరగా నిద్ర పట్టాలంటే పడుకునే ముందు స్క్రీన్లను చూడటం పూర్తిగా ఆపేయాలి.
7. హెల్తీ స్నాక్స్
సాయంత్రం పూట ఆకలి వేసినప్పుడు చిప్స్, బిస్కెట్లు, కేకులు వంటి ప్యాక్ చేసిన ఫుడ్స్ కాకుండా.. ఇంట్లో దొరికే సహజమైన ఆహార పదార్థాలను తీసుకోండి.
*ఫ్రెష్ బెర్రీలతో కూడిన పెరుగు.
*ఆపిల్ ముక్కలు, పీనట్ బటర్.
*క్యారెట్, దోసకాయ ముక్కలు లేదా డ్రై ఫ్రూట్స్.
చివరగా ఒక మాట.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కఠినమైన నిర్ణయాలు అవసరం లేదు. తీవ్రత కంటే 'నిలకడ' ముఖ్యం. రోజుకు కేవలం 5 నిమిషాల మంచి అలవాటైనా సరే, దానిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే.. 30 రోజుల్లో మీరే ఊహించని అద్భుతమైన మార్పును చూస్తారు.
