పూజల పేరిట అమాయకులను నమ్మించి.. లక్షల్లో డబ్బులు గుంజేసి.. చివరకు చేతబడి చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ కిలేడీ ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల కథనం ప్రకారం... చామర్తి రామ లచ్చారావు అనే పూజారి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని టార్గెట్ చేశాడు. పూజల పేరుతో నమ్మించి ఏకంగా 20 లక్షల రూపాయలు కాజేశాడు. అంతటితో ఆగకుండా, డబ్బులు తిరిగి అడిగితే చేతబడి చేస్తానంటూ బాధితుడిని తీవ్రంగా బెదిరించాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా అమెరికాకు పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, లుకౌట్ నోటీసులు (LOC) జారీ చేశారు.
అయితే ఈ కేటుగాడి లీలలు అమెరికాలో కూడా సాగాయి. అక్కడ కూడా పలువురిని చీటింగ్ చేయడంతో.. స్థానిక గుడి యజమాని ఇతనిపై కేసులు పెట్టాడు. దీంతో అక్కడ కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోననే భయంతో ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ పూజారి చేతిలో మోసపోయిన బాధితుల లిస్ట్ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూజల పేరిట, దోషాల నివారణ పేరిట ట్రాప్ చేసే ఇలాంటి నకిలీ పూజారుల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
