ప్రయాణికులకు అలెర్ట్: ఇండియా వస్తున్నారా? విమానం ఎక్కే ముందే ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే!

 ప్రయాణికులకు అలెర్ట్: ఇండియా వస్తున్నారా? విమానం ఎక్కే ముందే ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే!

 విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌తో కలిసి అప్‌గ్రేడెడ్ 'ఎయిర్ సువిధ 2.0' (Air Suvidha 2.0) పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ 'హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్'  ఫామ్‌ను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

 24 గంటల ముందే రిజిస్ట్రేషన్ 
కొత్త నిబంధనల ప్రకారం, భారతదేశానికి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కడానికి (బోర్డింగ్) 24 గంటల ముందే ఆన్‌లైన్‌లో వారి  వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. ప్రయాణికులు  చెక్-ఇన్ చేసుకునే సమయంలోనే ఈ ఫామ్‌ను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందులో గడిచిన 21 రోజుల్లో ఎక్కడెక్కడ తిరిగారు, ప్రయాణ చరిత్ర, ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉన్నాయా ? అనే వివరాలను కచ్చితంగా తెలపాల్సి ఉంటుంది.

ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాల్లో 'ఎబోలా' వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, విమానయాన శాఖలు అప్రమత్తమై ఈ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాయి. విదేశాల నుంచి వచ్చే వారు కేవలం అధికారిక వెబ్‌సైట్ https://airsuvidha.civilaviation.gov.in/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశాయి.