కుత్బుల్లాపూర్: 426 కిలోల గంజాయి పట్టివేత..ఆరుగురి అరెస్ట్

కుత్బుల్లాపూర్: 426 కిలోల గంజాయి పట్టివేత..ఆరుగురి అరెస్ట్

కుత్బుల్లాపూర్, వెలుగు: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురిని కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.28 కోట్ల విలువైన 426 కిలోల గంజాయితోపాటు ఓ డీసీఎం, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దుండిగల్ పీఎస్ లో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన సురంగిణీ పరిచ్చ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గజపతి జిల్లా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్ కు డీసీఎంలో గంజాయిని తరలిస్తోంది.

ఆమెతో కుమ్మక్కైన మహారాష్ట్రకు చెందిన మరో ఐదుగురు నిందితులు బాలుగణపథ్ కదమ్, ఉపలబ్ధ్​మంగళేశ్ బభోంస్లే, సమాధాన్​ గోకుల్​ ధోరట్, రాజుచవాన్, అరుణ్​ బాబూరావు చెండ్కేలు కారులో ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్నారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్-5 వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి, వీరిని పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలి భర్త రాహుల్ గతంలో ఎన్డీపీఎస్ కేసులో ఖమ్మం జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు అవినాశ్​ బాబు రాథోడ్​ , అభిజిత్​ థాటే పరారీలో ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.