సిటీలో 500కు పైగా ఇల్లీగల్ కెమికల్ గోడౌన్లు

సిటీలో 500కు పైగా ఇల్లీగల్ కెమికల్ గోడౌన్లు

జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్​పరిధిలోని ఇండస్ట్రియల్ ​ఏరియాల్లో 500కు పైగా ఇల్లీగల్ కెమికల్ గోడౌన్లు ఉన్నట్లు అంచనా. మేడ్చల్ ​జిల్లాలోని జీడిమెట్ల, ఎస్వీ కో ఆపరేటివ్ సొసైటీ, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలతో పాటు మరికొన్నిచోట్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఎలాంటి తనిఖీలు చేయట్లేదు. గత నెల బోయిగూడలోని స్క్రాప్​గోడౌన్ లో ఫైర్​యాక్సిడెంట్​జరిగి 11మంది సజీవ దహనమైనా అధికారుల్లో కదలిక లేదు. ఇల్లీగల్​గోడౌన్ల బయట కెమికల్​తో నింపి ఉన్న డ్రమ్ములు ఎప్పుడు బ్లాస్ట్​అవుతాయోనని సమీపంలోని జనం భయాందోళనకు గురవుతున్నారు.

డేంజర్ జోన్​లో మేడ్చల్​జిల్లా..

మేడ్చల్ జిల్లాలోని వందల గోడౌన్లలో అత్యంత మండే స్వభావం ఉన్న కెమికల్స్ ను డ్రమ్ముల్లో నిల్వ చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు చిన్న  చిన్న డబ్బాల్లోకి మార్చి అమ్ముతున్నారు. ఈ గోడౌన్ ల్లో ఎలాంటి ఫైర్​సేఫ్టీ ఉండదు. ఏదో మంచినీళ్లను నింపినట్లు నింపి దందా కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఎండలకు ఏదైనా బ్లాస్టింగ్​జరిగితే కలిగే నష్టాన్ని అంచనా వేయలేమని స్థానికులు చెప్తున్నారు. సిటీ మధ్యలోని ఒక్క స్క్రాప్​గోడౌన్ లో ప్రమాదం జరిగితేనే బాధితులను కాపాడడం కష్టమైంది. అలాంటిది వందల గోడౌన్లలోని కెమికల్స్​కు మంటలు అంటుకుంటే పరిస్థితి ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. కెమికల్​డ్రమ్ములు బ్లాస్ట్​అయితే వాటంతట అవి ఆరిపోవాలే తప్ప అదుపు చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లీగల్ కెమికల్ గోదాంలు కేవలం ఇండస్ట్రియల్ ఏరియాలకే పరిమితం కాలేదని, ఇళ్ల మధ్యలోని షెడ్లలోనూ కొనసాగుతున్నాయని తెలుస్తోంది. కొన్నిచోట్ల కింద నివాసాలు, పైన కెమికల్​ గోడౌన్లు రన్​ చేస్తున్నట్లు సమాచారం. గతంలో కుత్బుల్లాపూర్​ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలో ఓ కుటుంబం ఇంట్లోనే కెమికల్స్​నిల్వచేయడంతో ఫైర్​యాక్సిడెంట్​జరిగి ఇల్లే ధ్వంసమైంది. 2015లో అప్పటి కలెక్టర్​ స్పందించి పీసీబీ, పరిశ్రమలశాఖ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలను కలిపి ఓ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలోని ఆఫీసర్లు ప్రమాదకర గోడౌన్లను గుర్తించి ఖాళీ చేయించారు. తిరిగి అదే ప్రాంతాల్లో కెమికల్స్​నిల్వ చేస్తున్నారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఎస్వీ కోపరేటివ్​సొసైటీ, దూలపల్లి, దుండిగల్, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్​నగర్, భాగ్యలక్ష్మికాలనీ, వినాయక్​నగర్​ప్రాంతాల్లో గతంలో మాదిరిగానే కుప్పలు తెప్పలుగా గోడౌన్లు వెలిశాయి. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. ఏకంగా ఆరుబయట ఎండలో మండే స్వభావం ఉన్న కెమికల్ డ్రమ్ములను నిల్వ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఎస్వీ కో– ఆపరేటివ్​ సొసైటీలో పదుల సంఖ్యలో పక్కపక్కనే ప్రమాదకరంగా గోడౌన్లు నిర్వహిస్తున్నారు. ఆఫీసర్ల సహకారంతోనే ఇది జరుగుతున్నట్లు సమాచారం.  బోయిగూడ ఘటనను చూశాక కూడా మేల్కోకపోతే పరిస్థితులు చేయి దాటిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

మేడ్చల్​లోని కంపెనీలో అగ్ని ప్రమాదం

మేడ్చల్: మేడ్చల్ చెక్​ పోస్ట్​ ఏరియాలోని రాధన్ ఇండస్ట్రీస్ కంపెనీలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం  జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో స్థానికులు ఫైర్ స్టేషన్​కు కాల్​చేశారు. ఫైర్​సిబ్బంది వచ్చి అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మా పరిధిలోకి రావు

గతంలో కెమికల్​ గోడౌన్లు ప్రమాదకరంగా ఉండటంతో కలెక్టర్​ ఆదేశాలతో అన్ని శాఖల సమన్వయంతో గుర్తించాం. నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాం. ఇప్పడు మళ్లీ ఏర్పాటయ్యాయని తెలిసింది. గోడౌన్లు పరిశ్రమల శాఖ పరిధిలోకి రావు. కాబట్టి మేం ఏం చేసే పరిస్థితుల్లో లేము. 
- శ్రీనివాస్​రెడ్డి ,
 డిప్యూటీ చీఫ్​ ఇన్​స్పెక్టర్ ఆఫ్​ ఫ్యాక్టరీస్​

ప్రమాదాలు జరుగుతూనే ఉన్నయ్

కెమికల్ గోడౌన్ల మధ్య భయంతో బతకాల్సి వస్తోంది. ఎండాకాలంలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో గోడౌన్ లో వందల సంఖ్యలో కెమికల్ డ్రమ్ములు నిల్వ చేస్తున్నారు. మంటలు అంటుకుంటే రెండ్రోజుల వరకు ఆర్పడం కష్టం. ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి.
- కృష్ణ, జీడిమెట్ల