ఎస్ఎంసీలు మరో ఆరు నెలలు

ఎస్ఎంసీలు మరో ఆరు నెలలు
  •   6 నెలలు పొడిగిస్తూ మూడోసారి ఉత్తర్వులు జారీ
  •   నగరంలో క్రియాశీలకంగా పనిచేయని ఎస్‌ఎంసీలు
  •   ప్రభుత్వ బడుల బలోపేతానికి ఆమడ దూరం

హైదరాబాద్‍, వెలుగు: స్కూల్‍ మేనేజ్‍మెంట్‍ కమిటీ(ఎస్‍ఎంసీ) పదవి కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించడం పలు విమర్శలకు దారితీస్తుంది. జిల్లాలో  ఉన్న 686 ప్రభుత్వ స్కూల్స్ లలో ఈ కమిటీల పదవీ కాలాన్ని పొడిగించడం ఇది మూడో సారి కావడం గమనార్హం. జులై 31తో ఈ ఎస్‍ఎంసీ కమిటీల కాలపరిమితి ముగిసింది. ఈ సారైనా కొత్త కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తారని ఆశించిన ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం నిరాశే మిగిల్చింది.  ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో హెడ్‍ మాస్టర్లు, టీచర్లు కీలక బాధ్యత పోషిస్తారు. వీరితో పాటుగా ఎస్‍ఎంసీ కమిటీలు కూడా అంతే బాధ్యతతో ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాల్సిన ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కమిటీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నా రాజధాని ప్రాంతంలో క్రియాశీల బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపడం లేదు.

బాధ్యతలు ఘనం

టీచర్ల సమయపాలన, టీచింగ్‍ తీరు, మిడ్‍డే మీల్స్ తో పాటు పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వం అందించే మెయింటనెన్స్ నిధుల ఖర్చులను సైతం ఈ కమిటీల నిర్ణయం మేరకే ఖర్చు చేస్తారు.  స్టూడెంట్స్ కు యూనిఫాం, పాఠశాల అభివృద్ధి కోసం దాతలను ప్రోత్సహించేందుకు కమిటీ మెంబర్లు కృషి చేస్తారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు విద్యార్థుల్లో అవగాహనకు కృషి చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారో నిరంతరం తెలుసుకోవాలి. బడిలో ఏటా కొత్త అడ్మిషన్లు జరిగేలా చూడాలి. మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తోడ్పాటునందించాలి. ముఖ్యంగా స్కూల్‍ గ్రాంట్స్ సద్వినియోగం చేసేలా చూడాలి.

వచ్చే ఏడాది జనవరి వరకు ఈ కమిటీలే

హెడ్‍ మాస్టర్‍ చైర్మన్‍గా వ్యవహరిస్తారు. స్కూల్‍లో సెకండ్‍ ఇన్​చార్జితో పాటు టీచర్లు, స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీల కాల వ్యవధి రెండేళ్లు. చివరి సారిగా 2016లో ఎన్నికలు నిర్వహించారు. తాజాగా చేసిన పొడిగింపుతో ఇక వచ్చే ఏడాది జనవరి వరకు ఈ కమిటీలే బాధ్యతలు నిర్వహిస్తాయి.  1నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ ను కమిటీ మెంబర్లుగా ఎన్నుకుంటారు. ఇందులో ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ తదితర వర్గాలకు సమప్రాధాన్యత ఇస్తారు. ఎస్‍ఎంసీ కమిటీలలో 50 శాతం మహిళలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. బాలికలకు సంబంధించిన ప్రత్యేక స్కూల్స్ లలో మాత్రం కమిటీలో మొత్తం మహిళలే ఉండేలా ఎంపిక చేస్తారు. ప్రైమరీ స్కూల్స్ లలో 15 మంది, హై స్కూల్స్ లెవల్‍లో 24 మందితో కమిటీలను ఏర్పాటు ఉంటుంది.  ప్రస్తుత ఎస్‍ఎంసీ కమిటీలలో ఉన్న సభ్యుల పిల్లల చదువు పూర్తైతే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. చార్మినార్‍, బహదూర్‍పురా, అసిఫ్‍నగర్‍ తదితర మండలాల్లో ఎస్‍ఎంసీలు ఉన్నా లేనట్టుగానే ఉందని టీచర్లు తెలిపారు.

పైసలున్నోడిదే పెత్తనం

స్కూల్‍కు సమీపంలోని పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు సైతం కమిటీ  మెంబర్లు ఒప్పించేలా ముందుకు రావడం లేదు.జిల్లాలోని చాలా మండలాల్లో ఆశించిన మేరకు ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరలేదని టీచర్లే పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం అందజేసే నిధులు ఏ మూలకు సరిపోకపోవడంతో పైసలు పెట్టే స్థోమత ఉన్నవారినే కమిటీలోకి తీసుకుంటున్నట్లు, వారికే కీలక బాధ్యతలు అప్పజెప్పుతున్నట్లు టీచర్లు తెలిపారు. కొందరు హెచ్‍ఎంలు, డీచర్లు కమిటీ మెంబర్లతో అంటకాగుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. టీచర్లు సమయానికి రాకున్నా, వచ్చి మధ్యలోనే ఇతర పనులకు వెళ్లినా పట్టించుకోవడం లేదు. కనీసం మీటింగ్‍లు కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితి చాలా స్కూల్స్ లలో ఉంది.