ఎవరెస్ట్ సౌత్ బేస్ క్యాంప్‌కు వెళ్లాలంటే నేపాల్‌లోని లుల్కా నుంచి కాలినడకన వెళ్లాలి. 2,860 మీటర్ల ఎత్తున్న లుల్కా నుంచి 5,364 మీటర్ల ఎత్తున్న బేస్‌క్యాంప్‌కు ట్రెక్కింగ్ చేయాలి. మంచు, రాళ్లని దాటుకుంటూ ఈ క్యాంప్‌కి చేరుకోవడం ఓ సాహసమే. అలాంటి సాహసం చేశాడు ఓ ఏడేండ్ల చిన్నారి. అది కూడా డౌన్ సిండ్రోమ్‌తో. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి చిన్నారి పేరు అవినాష్. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ వందకి వందశాతం అవినాష్ తండ్రి ఆదిత్యకి దక్కుతుంది. డౌన్ సిండ్రోమ్ పిల్లల అడాప్షన్స్ పెంచడానికే ఈ సాహసం చేశామంటున్నాడు ఆదిత్య.
పుణెకి చెందిన ఆదిత్య అసలు పేరు ఆదిత్య తివారి. ఇంటర్నేషనల్ బ్యాంక్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఇతను సోషల్ వర్కర్ కూడా. యానిమల్ రైట్స్ కోసం తన గొంతు వినిపిస్తుంటాడు. ఇన్స్పిరేషనల్ స్పీకర్‌గానూ మంచి పేరుంది ఇతనికి. అవినాష్ విషయానికొస్తే పుట్టినప్పట్నించీ డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. దాంతో ఆ చిన్నారిని భారం అనుకొని తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలిపెట్టారు. అక్కడే వీళ్లిద్దరూ కలిశారు. కలిసి మౌంట్ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిచారు. చిన్నప్పట్నించీ అకేషన్ ఏదైనా అనాథాశ్రమం పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకునేవాడు ఆదిత్య. అలా ఏడేండ్ల కిందట తండ్రి బర్త్‌డే రోజు ఓ అనాథాశ్రమానికి వెళ్లాడు. అక్కడే మొదటిసారి ఆరు నెలల వయసున్న అవినాష్‌ని చూశాడు. చేతుల్లోకి తీసుకోగానే నవ్వుతూ తన చెయ్యి పట్టుకున్నాడు అవినాష్. అప్పట్నించీ ఆ నవ్వుని వెతుక్కుంటూ ప్రతివారం అక్కడికి వెళ్లేవాడు ఆదిత్య. కొన్నాళ్లకి ఆ చిన్నారిని భోపాల్‌లోని అనాథాశ్రమానికి పంపించారు. ప్రతివారం అక్కడికి కూడా వెళ్లేవాడు ఆదిత్య. కొన్నాళ్లకి అవినాష్‌ని దత్తత తీసుకోవాలనుకున్నాడు ఆదిత్య. అప్పటికి అతని వయసు ఇరవై ఆరేండ్లు. పెండ్లి కాలేదు. దాంతో దత్తత ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయినా వెనకడుగేయలేదు. చివరికి అవినాష్ దత్తత కోసం తను పడుతున్న ఆరాటాన్ని చూసి మధ్య ప్రదేశ్ వెల్ఫేర్ మినిస్టర్ సాయం చేశాడు. అలా పద్దెనిమిది నెలలు పోరాడి అవినాష్ కస్టడీ తీసుకున్నాడు ఆదిత్య.
జాలి వద్దు
అవినాష్‌కి డౌన్ సిండ్రోమ్‌తో పాటు మరికొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కానీ, అవినాష్‌ని చూసి ఎవరైనా జాలిపడితే నచ్చదు ఆదిత్యకి. ఎందుకంటే దానివల్ల ఆ చిన్నారి జీవితంలో మార్పు ఏమీ రాదు. అలాగే చాలామంది డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే వెనకడుగేస్తుంటారు. ఆ విషయంలో మార్పు తీసుకురావాలనే అవినాష్‌ని అందరికన్నా స్పెషల్‌గా పెంచాలనుకున్నాడు ఆదిత్య. డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఏదైనా సాధించగలరు అని చెప్పాలనుకున్నాడు. అదే జరిగింది కూడా. ‘‘ఆర్మీ స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకున్నాడు అవినాష్. ఫిజికల్లీ ఏబుల్డ్ పిల్లల కోసం ఉన్న స్పెషల్ ఒలింపిక్స్‌లోనూ పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి చేరుకున్నాడు. ఈ విజయంతోనైనా డౌన్ సిండ్రోమ్ పిల్లల అడాప్షన్స్ పెరగాలని కోరుకుంటున్నా ”అన్నాడు ఆదిత్య.
