హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం ఒకేసారి 74 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ వేర్వేరుగా రెండు జీఓలు జారీ చేశారు. 2025–26 ప్యానెల్ ఇయర్‌కు ఈ పదోన్నతులను కల్పించారు. ప్రస్తుతం ప్రమోషన్ పొందిన ఆఫీసర్లంతా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు తాము పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
24 మందికి సీఈఓలుగా పదోన్నతి
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 24 మంది డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు (డిప్యూటీ సీఈఓ) జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా (జడ్పీ సీఈఓ) ప్రమోషన్ కల్పించారు. అడ్హాక్ పద్ధతిలో (తాత్కాలిక ప్రాతిపదికన) ఈ నియామకాలు చేపట్టారు. మండల స్థాయిలో కీలకంగా వ్యవహరించే 50 మంది ఎంపీడీఓలు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ల (డీపీఓ) కు డిప్యూటీ సీఈఓ క్యాడర్‌కు ప్రమోషన్లు లభించాయి. ఇందులో పలువురు ఎంపీడీఓలు, డీపీఓలతో పాటు ఏపీడీలు, ఓఎస్డీలుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు.
ప్రమోషన్ పొందిన ఆఫీసర్లు 15 రోజుల్లోగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తీర్పులకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని, ఇవి పూర్తిగా అడ్హాక్ బేసిస్ మీద ఇచ్చినవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరికి సపరేట్‌గా పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తామని సెక్రటరీ శ్రీధర్ తెలిపారు.
