- నాలుగు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఈగల్ టీమ్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న పెడ్లర్లు, కస్టమర్లపై ఈగల్ ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) కేసుల్లో నిందితులు, కస్టమర్లుగా ఉన్న 75 మందిని అరెస్ట్ చేసింది. ఇందుకోసం గత నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
‘‘దేశవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ సప్లయర్లుగా, కస్టమర్లుగా గుర్తించిన వారి వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. 3,228 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, మరికొంత మంది పరారీలో ఉన్నట్లు గుర్తించాం. వీరిలో 1,278 మంది నిందితులు తెలంగాణకు చెందినవారు కావడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, 75 మందిని అదుపులోకి తీసుకున్నాం”అని ఈగల్ అధికారులు తెలిపారు.
