హైదరాబాద్, వెలుగు: ప్రకృతి పరిరక్షణతో పాటు పులుల సంరక్షణకు అందరూ బాధ్యతగా ముందుకు రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఆమె దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. పులులను కాపాడుకోవడం అంటే అడవిని, జీవవైవిధ్యాన్ని రక్షించడమేనని మంత్రి తెలిపారు. 1973 నాటి ప్రాజెక్ట్ టైగర్ వల్లే నేడు ప్రపంచంలో 75 శాతం పులులు భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించారు.
అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్‌తో కవ్వాల్‌ను అనుసంధానిస్తూ 'టైగర్ రీఇంట్రడక్షన్' చేపడుతున్నట్లు చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అటవీ ఉద్యోగులకు, చిత్రలేఖన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు మంత్రి బహుమతులు అందజేశారు. మరోవైపు, బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగిన వేర్వేరు కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖలో గతంలో నిలిచిపోయిన ప్రమోషన్లను పునరుద్ధరించి ఇప్పటివరకు 168 మందికి ఈవోలుగా పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 51 మందికి పదోన్నతి ఉత్తర్వులు, అర్చక సంక్షేమ నిధి ద్వారా 15 మంది అర్చకులకు గ్రాట్యుటీ, రుణ మంజూరు పత్రలను అందజేశారు. అర్చక సంక్షేమ నిధి కింద గ్రాట్యుటీని రూ.12 లక్షలకు, అంత్యక్రియల సాయాన్ని రూ.30 వేలకు పెంచి అర్చక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి సురేఖ పేర్కొన్నారు.
