లాక్ డౌన్ సడలింపులకు 8 రాష్ట్రాలు సపోర్ట్

లాక్ డౌన్ సడలింపులకు 8 రాష్ట్రాలు సపోర్ట్
  • పలు రంగాలకు మినహాయింపులు ఇస్తూ గైడ్​లైన్స్
  • రాత్రి 8 వరకు రెస్టారెంట్లకు కేరళ పర్మిషన్
  • ప్రైవేటు వెహికల్స్, బస్సులకు అనుమతి
  • కర్నాటకలో ఐటీ కంపెనీల నిర్వహణకు ఓకే
  • కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ఫాలో అవుతామన్న తమిళనాడు, గుజరాత్​
  • ఆంధ్రాలో రెడ్​జోన్లలో మాత్రమే లాక్​డౌన్​ రూల్స్​?
  • రిలాక్సేషన్​ వైపే బెంగాల్​, ఒడిశా కూడా..
  • మహారాష్ట్రలో 12 లక్షల మందికి రెండేసి వేలు

న్యూఢిల్లీ:కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగించిన అస్త్రం లాక్​డౌన్. లాక్​డౌన్​వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించినా.. దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలైంది. దీంతో గాడి తప్పిన ఎకానమీని మళ్లీ దారిలోకి తీసుకొచ్చేందుకు, ప్రజలకు ఇబ్బందులను తొలగించేందుకు కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించింది. పలు రంగాలకు మినహాయింపులు ఇస్తూ బుధవారం కేంద్ర హోం శాఖ గైడ్​లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నిర్ణయాన్ని కేరళ, మహారాష్ర్ట సహా 8కి పైగా రాష్ర్టాలు సపోర్ట్ చేశాయి. కన్​స్ర్టక్షన్, ఇరిగేషన్, రోడ్ల పనులకు అనుమతులు ఇచ్చాయి. రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు కేరళ పర్మిషన్ ఇచ్చింది. తక్కువ దూరాలకు బస్సులు నడిపేందుకు ఓకే చెప్పింది. కేంద్రంపై ఎప్పుడూ కస్సుబుస్సుమనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పలు రిలాక్సేషన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముంబై, పుణె మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు మహారాష్ర్ట ప్రయత్నిస్తోంది. ఐటీ కంపెనీల నిర్వహణకు కర్నాటక పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన గైడ్​లైన్స్​ను తు.చ. తప్పకుండా పాటిస్తామని గుజరాత్ ప్రకటించింది. తొలినుంచి సడలింపులు ఇవ్వాలని కోరుతున్న ఏపీ.. గైడ్​లైన్స్​ను ఇంప్లిమెంట్ చేసేందుకే మొగ్గు చూపుతోంది. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు కూడా కొన్ని రంగాల్లో పనులు మొదలుపెట్టడానికి పర్మిషన్లు ఇచ్చాయి.అయితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం ప్రోటోకాల్స్​ను నీరుగార్చలేవని హోంశాఖ గైడ్​లైన్స్ చెబుతున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కఠినమైన చర్యలను తీసుకునే వెసులుబాటు మాత్రమే ఉందని అంటున్నాయి.

కేరళలో నాలుగు జోన్లు

దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. కానీ ఇప్పుడు కేరళ కంటే చాలా రాష్ర్టాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఓవైపు వ్యాప్తిని అడ్డుకుంటూనే.. మరోవైపు వైరస్ సోకిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దేశంలోనే అత్యధికంగా 60% వరకు రికవరీ రేట్ ఉంది. (మొదటి పేజీ తరువాయి)

రోజువారీ కేసులు సింగిల్ డిజిట్​కు తగ్గిపోయాయి. డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. గత 7 రోజుల్లో కేవలం 32 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే సమయంలో 129 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో లాక్​డౌన్ సడలింపుల విషయంలో కూడా కేరళ ముందుగానే స్పందించింది.

  • రాష్ర్టాన్ని రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజించాలని నిర్ణయించింది.
  • ఆరెంజ్-ఏ జోన్​లో ఉన్న జిల్లాల్లో ఈనెల 24 నుంచి.. ఆరెంజ్-బీ జోన్​లో ఉన్న ప్రాంతాల్లో సోమవారం (20వ తేదీ) నుంచే సడలింపులు ఇస్తారు. ఈ జోన్లలో ప్రైవేటు వెహికల్స్​ను సరి-బేసి స్కీమ్ ప్రకారం అనుమతి ఇస్తారు. జిల్లాల పరిధిలో తక్కువ దూరాల మధ్య తిరిగేందుకు బస్సులకు అనుమతి. 60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరానికి అనుమతి ఇవ్వరు.
  • అయితే కచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటించాలి. ఎవరూ నిలుచుని ట్రావెల్ చేయకూడదు. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకుని ఉండాలి. ప్యాసింజర్లకు హ్యాండ్ శానిటైజర్లు ప్రొవైడ్ చేయాలి. రెస్టారెంట్లు రాత్రి 8 దాకా ఓపెన్​లో ఉంటాయి. అయితే ‘డైన్-ఇన్(రెస్టారెంట్​లో తినేందుకు)’ మాత్రం 7 గంటల వరకే పర్మిషన్. పార్సిల్​కు  8 గంటల వరకు అనుమతి ఉంటుంది.
  • గ్రీన్ జోన్​లో ఉన్న జిల్లాల్లో సోమవారం నుంచి పూర్తిగా ఆంక్షలు ఎత్తేయాలని భావిస్తోంది.

మహారాష్ర్ట

దేశంలో కరోనా కల్లోలంలో చిక్కుకున్న రాష్ర్టం మహారాష్ర్ట. నమోదవుతున్న కేసులు, మృతుల సంఖ్య అక్కడే ఎక్కువ. 3500కు  పైగా కేసులు నమోదు కాగా.. 200 మందికి పైగా చనిపోయారు. ముంబై, పుణె జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయినప్పటికీ లాక్​డౌన్​లో కొన్ని సడలింపులు ఇవ్వాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గైడ్​లైన్స్ జారీ చేసింది. ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు ఎంపిక చేసిన కొన్ని అడిషనల్ యాక్టివిటీలకు ఈనెల 20 నుంచి అనుమతి ఇచ్చింది.

  • రాష్ర్టంలో రిజిస్టర్ చేసుకున్న 12 లక్షల మంది నిర్మాణరంగ కూలీలకు రూ.2 వేల చొప్పున చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కూలీల అకౌంట్లలోనే డబ్బు జమ చేయనుంది.
  • వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఉపాధి రంగాలు, కార్గో సేవలు, వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పరిశ్రమలు, స్పెషల్ ఎకనమిక్ జోన్లలో మాన్యుఫాక్చరింగ్​కు అనుమతి ఇచ్చింది. అయితే ఇవి కంటెయిన్​మెంట్ జోన్లకు వర్తించవని చెప్పింది.
  • గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పూర్తిగా లాక్​డౌన్ ఎత్తేయనున్నట్లు సమాచారం.
  • రాష్ర్టంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన ముంబై, పుణె మినహా మిగతా ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది.
  • ఎరువులు, పురుగుమందుల యూనిట్లు, వ్యవసాయ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమలను లాక్​డౌన్ నుంచి మినహాయిస్తూ బుధవారమే నిర్ణయం తీసుకుంది.
  • ఇంకిన్ని రాష్ర్టాల్లో ఇలా..
  • కేంద్ర గైడ్​లైన్స్​కు అనుగుణంగా సడలింపులు ఇవ్వాలని తమిళనాడు నిర్ణయించింది. కంపెనీలు జిల్లా కలెక్టర్లు లేదా జిల్లా ఇండస్ర్టీ సెంటర్ల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించింది.
  • లాక్​డౌన్ సడలింపులపై రోడ్ మ్యాప్ రెడీ చేయాలని అధికారులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
  • కేంద్ర మార్గదర్శకాలను యథాతథంగా అమలు చేస్తామని గుజరాత్ ప్రకటించింది.
  • రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, బిల్డింగుల నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కర్నాటక

లాక్​డౌన్ విడతల వారీగా ఎత్తేయాలని తొలుత భావించిన రాష్ర్టం కర్నాటక.  సడలింపు ఎలా ఇవ్వాలనే దానిపై ఎక్స్​పర్ట్స్​ కమిటీని ఏర్పాటు చేసి, రిపోర్టు కూడా తీసుకుంది. కేంద్రం గైడ్​లైన్స్ జారీ చేయడంతో.. మరిన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించింది.

  • ఈనెల 21 నుంచి టూ వీలర్లు, గూడ్స్ వెహికల్స్, కార్లు (పాసులతో) తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కంటెయిన్​మెంట్ జోన్లు, హాట్​స్పాట్లకు సడలింపులు వర్తించవని తెలిపింది.
  • ప్రభుత్వ శాఖలు, ఐటీ/బీటీ కంపెనీలు, ఇతర బిజినెస్ సంస్థలు 33 % వర్క్ ఫోర్స్​తో పని చేసేందుకు అనుమతి. ఐటీ/బీటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు పర్మిషన్.
  • మే 3 వరకు 144 సెక్షన్ కొనసాగిస్తోంది.
  • నిర్మాణ రంగాలకు అనుమతి. కార్మికులు కన్​స్ర్టక్షన్ సైట్లలో ఉండేలా ఏర్పాట్లు.
  • లాక్ డౌన్ కారణంగా లేఆఫ్​ ప్రకటించొద్దని ఐటీ, బయోటెక్నాలజీ (బీటీ), వీటి అనుబంధ కంపెనీలను కోరింది.

ఏప్రిల్ 20 తర్వాత 50% ఎంప్లాయ్స్ తో కంపెనీలను రన్ చేయడానికి అవకాశం ఇస్తున్నామని ఐటీ, బీటీ  కంపెనీలకు చెప్పింది. ఒకేసారి 50% మందిని కాకుండా వర్క్ ఫోర్స్ ను కొద్దికొద్దిగా పెంచుతూ పోవాలని సూచించింది. బెంగళూర్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్స్ కు రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్

ఎకానమీకి బూస్ట్ ఇచ్చేందుకు లాక్​డౌన్​నుంచి కొన్ని సడలింపులు ఇవ్వాలని మొదటి నుంచి కోరుతున్న రాష్ర్టం ఏపీ. లాక్​డౌన్​ను రెడ్​జోన్ల వరకు మాత్రమే పరిమితం చేయాలని కూడా కోరింది. ఎకనామిక్ యాక్టివిటీలకు అనుమతి ఇవ్వాలని, అగ్రికల్చర్, ఆక్వా, ఇండస్ర్టియల్ ఆపరేషన్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. కేంద్రం గైడ్​లైన్స్​తో కొంత ఊరట పొందింది.

  •    రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో విక్రయించడానికి ఎక్స్​పోర్ట్ పర్మిట్ లెటర్లు ఇవ్వడాన్ని వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రారంభించింది.
  •    రైతు బజార్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 100 రైతు బజార్లకు అదనంగా 471 తాత్కాలికంగా ఏర్పాటు చేసింది.
  •    ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లాక్​డౌన్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది.

పశ్చిమ బెంగాల్

కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉన్న రాష్ర్టం వెస్ట్ బెంగాల్. ప్రతి విషయంలో కేంద్రాన్ని వ్యతిరేకించే సీఎం మమతా బెనర్జీ.. లాక్​డౌన్​ను మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 300 వరకు కేసులు నమోదు కాగా, 15 మంది వరకు చనిపోయారు. ఈ క్రమంలో కొన్ని సడలింపులకు బెంగాల్ సిద్ధంగా ఉంది.

  •    రూరల్ ఏరియాలు, క్లస్టర్లలో ప్లాంట్లు, ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చే విషయంపై నమోదైన కేసుల వారీగా నిర్ణయం.
  •    నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడానికి పర్మిషన్.
  •    టీ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలకు, జనపనార మిల్లులకు అనుమతులు.
  •    బీడీ తయారీకి అనుమతి. కానీ కేంద్రం సవరించిన మార్గదర్శకాల ప్రకారం పొగాకు, గుట్కా తదితరాల అమ్మకాలపై నిషేధం ఉంది.