హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కలిసి ఆరు జోన్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆదిబట్ల, సంతోష్ నగర్, ఛత్రినాక, టిప్పుఖాన్ బ్రిడ్జి, బేగంబజార్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, తార్నాక, మెట్టుగూడ ప్రాంతాల్లో ఆక్రమణలను క్లియర్ చేశారు.
ఈ ఒక్కరోజే 440 శాశ్వత, 456 తాత్కాలిక నిర్మాణాలు కలిపి మొత్తం 896 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో మూడు శనివారాలు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 2,337 ఆక్రమణలను తొలగించామని, పాదచారుల సౌకర్యం కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

