రాష్ట్ర బీజేపీ పగ్గాలు: పోటీ పడుతున్నది వీళ్లే

రాష్ట్ర బీజేపీ పగ్గాలు: పోటీ పడుతున్నది వీళ్లే

రాష్ట్ర చీఫ్​ పదవి కోసం పోటాపోటీ          
హైకమాండ్​ దృష్టిలో పడేందుకు నేతల ప్రయత్నాలు       

 

రాష్ట్రంలో బలోపేతం కావాలని, వచ్చే ఎలక్షన్ల నాటికి గట్టి ప్రత్యామ్నాయంగా నిలవాలని భావిస్తున్న బీజేపీలో రాష్ట్ర పగ్గాలు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అది పూర్తికాగానే కొత్త చీఫ్ నియామకంపై ఢిల్లీ పెద్దలు దృష్టి సారించనున్నారు. రెండు నెలల్లోగా రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్​ నియామకం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాషాయ నేతల్లో పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం చీఫ్​గా ఉన్న కె.లక్ష్మణ్​ తనకే మరోసారి అవకాశం కల్పించాల్సిందిగా బీజేపీ హైకమాండ్​ను కోరుతున్నారు. మరోవైపు రేసులో సీనియర్​ నాయకురాలు డీకే అరుణ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. లోక్​సభ ఎలక్షన్ల ముందే బీజేపీలో చేరిన ఆమె కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్​లో కేసీఆర్​ కుమార్తె కవితను ఓడించిన ధర్మపురి అర్వింద్, కరీంనగర్​లో టీఆర్ఎస్​ సీనియర్​ వినోద్​కుమార్​ను ఓడించిన బండి సంజయ్​ కూడా పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ల బరిలో దిగకుండా కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన ఒకరిద్దరు నేతలు కూడా పార్టీ చీఫ్​ పదవి కోసం జాతీయ స్థాయిలో ప్రయత్నిస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

గట్టిగానే ట్రై చేస్తున్నరు
లోక్​సభ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్​ నుంచి డీకే అరుణ, టీఆర్ఎస్​ నుంచి జితేందర్​రెడ్డి బీజేపీలో చేరారు. రిజల్ట్స్​ తర్వాత పెద్దిరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, చాడ సురేశ్​రెడ్డి వంటి మరికొందరు సీనియర్లు కూడా బీజేపీ గూటికి వచ్చారు. పార్టీలో ముందు నుంచి ఉన్న సీనియర్లలో దత్తాత్రేయ ఇటీవలి ఎలక్షన్లలో పోటీకి దూరంగా ఉన్నారు. లక్ష్మణ్​ ప్రస్తుతం రాష్ట్ర చీఫ్​గా ఉన్నారు. కిషన్​రెడ్డికి కేంద్ర మంత్రి పదవి లభించింది. ఇక నిజామాబాద్​లో అర్వింద్, కరీంనగర్​లో బండి సంజయ్​ జెయింట్​ కిల్లర్లుగా నిలిచి.. పార్టీ హైకమాండ్​ దృష్టిలో పడ్డారు.

ఎవరెవరు?
అందరిలో పార్టీ రాష్ట్ర చీఫ్​ పదవి కోసం లక్ష్మణ్​తోపాటు ప్రధానంగా డీకే అరుణ పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆమెకు సపోర్టు ఇస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్​ నుంచి ఓ వర్గం నేతలను ఆకర్షించాలంటే.. అదే సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు పగ్గాలు ఇస్తే బెటరని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే పార్టీలో చేరిన ఆమెకు పదవి ఇచ్చే అవకాశం తక్కువేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. లక్ష్మణ్​కు అమిత్​షా ఆశీస్సులు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సపోర్ట్​ ఉన్నాయని.. ఆయననే మరో టర్మ్​ కొనసాగించవచ్చని అంటున్నారు. ఒకవేళ కొత్తవారికి చాన్స్​ ఇస్తే బండి సంజయ్, అర్వింద్​ల పేర్లు తెరపైకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్న ఆశతో పార్టీ చీఫ్​ పదవి కోసం పోటీ బాగా పెరిగింది.

మెంబర్షిప్ డ్రైవ్ ముగియగానే..
రాష్ట్రంలో టీఆర్ఎస్​ దెబ్బకు కాంగ్రెస్​పార్టీ బలహీనపడింది. ఇదే సమయంలో జరిగిన లోక్​సభ ఎలక్షన్లలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇప్పటికే తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో కదులుతున్న బీజేపీ హైకమాండ్​కు ఇది మరింత ఊపునిచ్చింది. ఇదే జోష్​లో పార్టీని బలోపేతం చేసుకోవాలని, వచ్చే ఎన్నికల నాటికి అధికారం చేపట్టాలని భావిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ నేతలను ఆకర్షించే పనిలో పడింది. దీంతో ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయి. కాంగ్రెస్, టీడీపీలతోపాటు టీఆర్​ఎస్​ నుంచి కూడా పలువురు సీనియర్లు, నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు, కొత్తవారికి పదవులు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి​గా ఉన్న కె.లక్ష్మణ్​ పదవీకాలం గతేడాది డిసెంబర్​లోనే ముగిసినా.. ఎలక్షన్ల నేపథ్యంలో ఏడాది కాలం పాటు పొడిగించారు. ఎలక్షన్లు ముగిసి, బీజేపీ సభ్యత్వ నమోదు కూడా జరుగుతోంది. ఇది కార్యక్రమం పూర్తికాగానే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ హైకమాండ్​ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో పార్టీ రాష్ట్ర చీఫ్​ పదవిపై పాత, కొత్త నేతలు ఆశలు పెట్టుకున్నారు.