మరొకరిపై దాడి చేసిన ఎలుగు.. భద్రాద్రిలో వణుకుతున్న జనాలు

మరొకరిపై దాడి చేసిన ఎలుగు.. భద్రాద్రిలో వణుకుతున్న జనాలు
  • మొన్న మద్దుకూరులో...ఇప్పుడు చండ్రుగొండలో...

చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో సోమవారం ఒకరిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన మరువకముందే మరొకరిని గాయపర్చింది. మద్దుకూరులో సోమవారం వాకింగ్ కు వెళ్తున్న రామారావు అనే రిటైర్డ్​సింగరేణి ఎంప్లాయ్​పై దాడి చేయగా మంగళవారం చండ్రుగొండలో అంబేద్కర్ కాలనీకి చెందిన  కంచర్ల తిరుపతిపై అటాక్​ చేసింది. తిరుపతి ఉదయం ఇంటి నుంచి బయిటికి రాగా వెనక నుంచి వచ్చిన ఎలుగు మీద పడి కాలుపై గాయం చేసింది. తిరుపతి కేకలు వేయడంతో  కుటుంబసభ్యులు, గ్రామస్తులు పరిగెత్తుకువచ్చారు. దీంతో ఎలుగుబంటి పొలాల మీదుగా పారిపోయింది.

ఫారెస్ట్ రేంజర్ ఎల్లయ్య దవాఖానలో చికిత్స పొందుతున్న తిరుపతిని వివరాలడిగి తెల్సుకున్నారు. ఎఫ్​డీవో కోటేశ్వరావు, ఎస్సై రవి, తహసీల్దార్​సాదియా సుల్తానా బాధితుడిని పరామర్శించి గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. ఎఫ్​డీవో కోటేశ్వరావు మాట్లాడుతూ ఉదయం వేళలో మంచు ఎక్కువగా పడుతోందని, వ్యవసాయ, కూలీ పనులకు గుంపులుగా వెళ్లాలని, చేతిలో కర్ర పట్టుకోవాలని సూచించారు. నాలుగు స్పెషల్​టీంలను ఏర్పాటు చేసి ఎలుగుబంటి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎలుగుబంటి రాత్రి అడవిలోకి వెళ్లి ఉదయం గ్రామాల్లోకి  వచ్చే అవకాశాలుంటాయని చెప్పారు. సమాచారం తెలిస్తే ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేయాలన్నారు.