వివాదంలో ‘కాళీ’ పోస్టర్.. వెనక్కి తగ్గనంటున్న డైరెక్టర్ లీనా

వివాదంలో ‘కాళీ’ పోస్టర్.. వెనక్కి తగ్గనంటున్న డైరెక్టర్ లీనా

‘కాళి’ పేరుతో  రిలీజ్‌ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌ పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో కాళీమాత గెటప్ లో ఉన్న నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకుని, మరో చేతితో సిగిరెట్ తాగుతున్నట్లు ఉంది. మరో చేతితో LGBT జెండాను పట్టుకున్నట్లు పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారింది.

తమిళనాడులో పుట్టి ప్రస్తుతం టొరంటో (కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై.. కాళి టైటిల్‌తో రెండు రోజుల క్రితం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.  పోస్టర్‌ అభ్యంతరకరంగా ఉందని, లీనా మణిమేకలై వెంటనే క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ కొందరు నెటిజన్లుహెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో ఆమె వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చగొట్టేలా ఓ ట్వీట్ చేశారు. 

సోషల్ మీడియాలో లీనా మణిమేకలైపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అరెస్ట్‌ లీనా మణిమేకలై హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతున్న నేపథ్యంలో ఆమె ఓ ట్వీట్ చేశారు. ముందు సినిమా చూడాలని, ఆపై అరెస్ట్‌ అంటూ డిమాండ్‌ చేసిన వాళ్లంతా లవ్‌యూ అంటారంటూ ట్వీట్‌లో లీనా మణిమేకలై పేర్కొంది. అయినా ఆమె వివరణతో వివాదం మాత్రం చల్లారడం లేదు. 

 

ఢిల్లీకి చెందిన ఓ లాయర్‌ .. లీనాపై ఢిల్లీ సైబర్‌ సెల్‌ ఐఎఫ్‌ఎస్‌వోలో ఫిర్యాదు చేశారు. గౌ మహాసభ నిర్వాహకుడు అజయ్‌ గౌతమ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు హోం సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ డాక్యుమెంటరీని ఆపించాలంటూ కోరారు. మరికొన్ని చోట్ల సైతం లీనాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

‘నేను కోల్పోవడానికి ఏమీ లేదు. దేనికీ భయపడకుండా మాట్లాడుతాను. ఒకవేళ నా ప్రాణమే వెల కడితే.. ఇచ్చేస్తాను’ అంటూ లీనా మణిమేకలై ట్వీట్ చేసింది. టొరంటో ఆగాఖాన్‌ మ్యూజియమ్‌ వద్ద రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా సెగ్మెంట్‌లో భాగంగా ఈ డాక్యుమెంటరీని తీసినట్లు లీనా మణిమేకలై చెబుతున్నారు. ఒకవైపు లీనా.. మరోవైపు విమర్శకులు ఎంతకూ తగ్గకపోవడంతో ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.