భర్త కళ్లముందే భార్య గొంతుకోసిన దుండగులు..అడ్డుకోబోయిన భర్తపైనా కత్తితో దాడి

భర్త కళ్లముందే  భార్య గొంతుకోసిన దుండగులు..అడ్డుకోబోయిన భర్తపైనా కత్తితో దాడి
  •      భార్య మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త 
  •     సంగారెడ్డి జిల్లా ఐడీఏ  బొల్లారంలో దారుణం
  •     రేప్​ చేసి చంపినట్టు అనుమానాలు

సంగారడ్డి/జిన్నారం, వెలుగు:  రాత్రిపూట మార్కెట్​కు వెళ్లి తిరిగి వస్తున్న దంపతులపై కొందరు దుండగులు అతి కిరాతకంగా దాడి చేశారు. భర్త కళ్ల ముందే భార్య గొంతుకోసి చంపారు. అడ్డుకోబోయిన భర్తపైనా దాడి చేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో శనివారం రాత్రి జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన మీనా (35), ఆమె భర్త అనిల్(40) ఐడీఏ బొల్లారం వెంకటేశ్వర నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి అతడు భార్యతో కలిసి బైక్‌‌‌‌‌‌‌‌పై బొల్లారం మార్కెట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి 10:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో గండిగూడెం శివారు స్పోర్ట్స్ గ్రౌండ్ వద్దకు రాగానే కొందరు గుర్తుతెలియని ఆకతాయిలు అడ్డగించి మీనా చేయి పట్టుకొని వేధించారు. 
అడ్డుకున్న అనిల్‌‌తో గొడవపడిన ఆకతాయిలు.. అతడిపై కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత మీనాను పక్కనున్న పొదల్లోకి లాకెళ్లి.. గొంతు కోసి చంపేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా సదరు మహిళ శరీరంపై బలమైన గాయాలు కనిపించాయి. వెంటనే అనిల్‌‌ను బొల్లారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించినట్టు సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీఐ వెల్లడించారు.

ఘటనపై పలు అనుమానాలు  

ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహిళపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారా? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు భర్త అనిల్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ కోలుకున్నాక అతడ్ని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక దాని ఆధారంగా విచారణ చేపడితే వాస్తవాలు తెలిసే చాన్స్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.