- బుక్ చేసి వారాలు గడుస్తున్నా రావడం లేదంటూ ఆగ్రహం
- మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో ఘటన
శివ్వంపేట, వెలుగు : సిలిండర్లు బుక్ చేసినా త్వరగా రావడం లేదన్న కోపంతో... గ్రామంలోకి వచ్చిన డెలివరీ ఆటోలో ఉన్న సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... శివ్వంపేటలోని భారత్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో సిలిండర్ల డెలివరీ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. అయితే బుక్ చేసినప్పటికీ సిలిండర్లు సరఫరా కావడం లేదంటూ వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఆటోను చుట్టుముట్టి అందులో ఉన్న 40 సిలిండర్లను ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వినియోగదారులను చెదరగొట్టారు. అనంతరం గ్రామంలో విచారణ జరిపి సిలిండర్లను రికవరీ చేశారు. మూడు సిలిండర్లు దొరకకపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సిలిండర్లను ఎత్తుకెళ్లిన గ్రామస్తులను శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ.. గ్యాస్ బుక్ చేసినప్పటికీ సిలిండర్ డెలివరీ చేయడం లేదని, కొందరికి డెలివరీ అయినట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నా.. సిలిండర్ మాత్రం అందడం లేదన్నారు. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీకి వెళ్లి సిలిండర్ తీసుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు.

