చెట్లు ఎక్కి డబ్బు సంపాదిస్తున్న అమ్మాయి

చెట్లు ఎక్కి డబ్బు సంపాదిస్తున్న అమ్మాయి

ఒక అమ్మాయి చెట్లు , గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం వింతగా చూస్తారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొద్దా ?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబ పోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది పాతికేళ్ల శ్రీదేవి గోపాలన్.

శ్రీదేవి కుటుంబం కేరళలోని మలప్పురం గ్రామంలో ఉంటోంది. ఆమె తండ్రి గోపాలన్ కొబ్బరి చెట్లు ఎక్కి, కాయలు కోయడంతో వచ్చే డబ్బుతో ముగ్గురు ఆడపిల్లలను చదివిస్తున్నాడు. వచ్చే ఆదాయం ఇంటి పోషణ. పిల్ల ల చదువుకు సరిపోక ఎప్పుడూ ఇబ్బంది పడేవాడు. తండ్రి కష్టాన్ని అర్థం  చేసుకున్న పెద్ద కూతురు శ్రీదేవి.. తండ్రిలాగా కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకుంది. కరోనా కారణంగా ఎలాగూ కాలేజీలు తెరవట్లేదు. అందుకే ఇలా తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండేందుకు సిద్ధ పడింది.

తండ్రి కష్టం చూడలేక..

‘‘ఇంట్లో పెద్ద కూతుర్ని కావడం వల్ల నాకు అమ్మానాన్నల కష్టం అర్థమయ్యేది. వాళ్లు ఎప్పుడూ మా స్కూల్, కాలేజీల ఫీజుల గురించి మాట్లాడుకుంటూ ఉండటం గమనించే దాన్ని. నాన్నకు వచ్చే కొంత డబ్బుతోనే మాకు కావలసినవన్నీ సమకూర్చేవాడు. ఒక్కరి సంపాదనతో ముగ్గురు ఆడపిల్లలను పెంచడం అంత  సులువైన పని కాదు. అందుకే నాన్న బాధ్యతను  పంచుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఈ కరోనా నాకు ఆ అవకాశాన్ని అందించింది. ఇప్పుడు మా చుట్టు పక్కల్లో కొత్తగా నాన్న తొమ్మిది చెట్లను పట్టుకున్నాడు. ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. ఒక్క చెట్టు ఎక్కితే నలభై రూపాయలు ఇస్తారు” అని సంతోషంగా చెప్తోంది శ్రీదేవి.

పెద్ద కొడుకులా మారి..

లాక్డౌన్ కారణంగా అందరిలాగే గోపాలన్ కుటుంబం కూడా ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నది. మనకు ఒక కొడుకు ఉంటే, నాకు కొబ్బరి చెట్లు ఎక్కే పనిలో సాయంగా ఉండేవాడు కదా’ అని గోపాలన్ ఒకరోజు తన భార్యతో అనడం శ్రీదేవి చెవిన పడింది. తండ్రికి ఎంత కష్టంగా ఉంటే ఆ మాట అంటాడని ఆలోచించింది. అప్పుడే ‘తానెందుకు కొబ్బరి చెట్టు ఎక్కకూడదు’ అనుకుంది. యూట్యూబ్​లో వీడియోలు, ట్యుటోరియల్ క్లాసులు చూసి కొబ్బరి చెట్లు ఎక్కడంలో టెక్నిక్స్​ తెలుసుకుంది. ఇంట్లో వాళ్లకు తన నిర్ణయం చెప్పగానే.. సొసైటీ ఏమనుకుంటుందో అని వద్దన్నారు. చివరికి శ్రీదేవి ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించి తండ్రి సాయంతో చెట్టు ఎక్కడం.. ఎలాంటి కొబ్బరి కొయ్యాలి?  ఏది పండు?  ఏది కాయ?  అన్న విషయాలను నేర్చుకుంది. కేవలం రెండే నెలల్లో తండ్రి చేస్తున్న పని నేర్చుకుని, కుటుంబానికి తనవంతు సంపాదన అందిస్తోంది. ఇరుగు పొరుగు మాటలు శ్రీదేవి చెట్లు ఎక్కడం నేర్చుకుంటుందన్న విషయం మెల్లిగా ఊరంతా పాకింది. దాంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా అవమానించడం మొదలుపెట్టారు. ‘నువ్వు ఇంత కష్టపడి చదివిస్తున్నది ఈ చెట్లు ఎక్కించడానికేనా?’, ‘ఇలా ఒక అమ్మాయి కొబ్బరి చెట్టు ఎక్కే పని చేస్తుందంటే, ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘ఆ పిల్లకు బుద్ధి లేదు.. తల్లిదండ్రులుగా మీరైనా చెప్పాలిగా’ వంటి సూటిపోటి మాటలతో ఆ కుటుంబాన్ని మానసికంగా కుంగదీసే ప్రయత్నంచేశారు ఆ ఊరి జనం. కానీ కూతురి ఆత్మవిశ్వాసం చూసి గోపాలన్ వెనక్కి తగ్గలేదు.

టీచర్ అవ్వాలన్నదే ధ్యేయం

ఎప్పటికైనా టీచర్ అవ్వాలన్నది శ్రీదేవి గోల్. హిస్టరీలో పీజీ చేసింది. ప్రస్తుతం బీఎడ్ ఫైనల్ ఎగ్జామ్స్​కి ప్రిపేర్ అవుతోంది. ఈ కరోనా, లాక్ డౌన్ కారణంగా పరీక్షలు ఆగిపోయాయి. అందుకే ఈ ఖాళీ సమయంలో కొబ్బరి చెట్లు ఎక్కి కుటుంబ బాధ్యతను ఒంటరిగా మోస్తున్న తండ్రికి తోడుగా ఉండాలనుకుంది. కొబ్బరి చెట్లు ఎక్కాలనుకుంటున్న విషయాన్ని ఆమె మొదట ఇద్దరు చెల్లెళ్లతో షేర్ చేసుకుంది. వాళ్లు ఇచ్చిన ఐడియాతో ఆన్ లైన్​లో చెట్లు ఎక్కేటప్పు డు గ్రిప్ ఇచ్చే మెషిన్ గురించి తెలుసుకుంది. అది వాళ్ల నాన్నకు కూడా ఉపయోగపడుతుందని ఆర్డర్ చేసింది. అలాగే ఆ కుటుంబానికి కారు కొనే స్థోమత లేదు. అందుకే అటూ ఇటూ వెళ్లడానికి, ఆర్థికంగా కొంత ఆదాయం పెరగడానికి కొన్నిరోజుల క్రితం ఆటో తీసుకున్నారు. శ్రీదేవి ఆటో నడపడం కూడా నేర్చుకుంది.

అనుకుంటే అయిపోతుంది

‘‘ఏదైనా చేయాలని అనిపిస్తే, దాన్ని ఎంత కష్టమైనా వదలొద్దు. కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకుంటుంటేనే నాన్న కష్టం బాగా అర్థమైంది. నా ఇద్దరి చెల్లెళ్లకు కూడా టెక్నిక్స్ నేర్పిస్తున్నా. ఆడపిల్లలు చేయలేని పనులంటూ ఉండవని నిరూపించాలనుకుంటున్నా. ఈ కరోనా నాకు ఎన్నో కొత్త పాఠాలను నేర్పింది. పని మాత్రమే కాదు.. సమాజంలో అమ్మాయిల విషయంలో ఉన్న తేడాను కళ్లారా చూశాను. ఆటో నడపడం కూడా నేర్చుకున్నా కాబట్టి రేపు లైసెన్స్ వచ్చాక అది కూడా నడుపుతా. నా అల్టిమేట్ గోల్ టీచర్ అవ్వాలని. రేపటి తరంలోనైనా ఆడపిల్లపై ఎలాంటి వివక్షకు తావులేకుండా చేయడానికి నా వంతుగా కృషి చేస్తా. ఆ దిశగా నా విద్యార్థులకు పాఠాలు చెప్పాలని అనుకుంటున్నానుఅని గర్వంగా చెప్తోంది శ్రీదేవి.

 పట్టుదల ఎక్కువ

‘‘శ్రీదేవి అందరిలాంటి అమ్మాయి కాదు.. ఏదైనా అనుకున్నదంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టదు. తనకు పట్టుదల, కష్టపడేతత్వం ఎక్కువ, చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరిలో శ్రీదేవికి చాలా ధైర్యం. కొబ్బరి చెట్లు ఎక్కుతుందని తెలిసినప్పుడే నేను అనుకున్నా.. ఎవరేమన్నా తను పట్టించుకోదని” అంటోంది శ్రీదేవి ఫ్రెండ్ అశ్వతి నయ్యర్.