లీటర్ పెట్రోల్ రూ. 160.. అయినా ఫుల్ డిమాండ్..

లీటర్ పెట్రోల్ రూ. 160.. అయినా ఫుల్ డిమాండ్..
  • పెట్రోల్ లీటర్ రూ. 160
  • సిటీలో  రెండు బంకుల్లోనే దొరుకుతున్న ఆక్టేన్ 100
  • ఎక్స్ ట్రా ప్రీమియం, బెటర్ క్వాలిటీ  
  • లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకుల్లో వాడేందుకు  ఇంట్రెస్ట్

హైదరాబాద్, వెలుగు: పెట్రోల్ రేటేంటీ? లీటర్ కు రూ. 160 అని ఆశ్చర్య పోతున్నారా ? సెంచరీకి చేరువైన పెట్రోల్ ధర ఎప్పుడు 160 కి చేరిందని షాక్ అవుతున్నారా? కానీ మీరు విన్నది నిజమే. ఈ పెట్రోల్ ధర లీటర్ కు అక్షరాల రూ. 160.  కానీ ఇది అందరూ రెగ్యులర్ గా వాడుతున్న పెట్రోల్ రేటు కాదు. అంతకు మించి స్పెషల్ క్వాలిటీ ఉన్న ఆక్టేన్ ఎక్స్ ట్రా ప్రీమియం 100. దీనికి ఉన్న ప్రత్యేకతే ఇంత ధరకు కారణం. వందశాతం బర్న్ అవటంతో పాటు పొల్యూషన్ ఫ్రీ గా ఉండే ఈ పెట్రోల్ ను వాడితే బండ్లు మంచి కండిషన్ లో ఉంటాయి. అందుకని లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్స్ వాడే వారంతా ఇప్పుడు ఆక్టేన్ 100 పెట్రోల్ కు పిఫ్ట్ అవుతున్నారు. 

ఏమిటీ ఆక్టేన్ 100?

పెట్రోల్ లో రకరకాల క్వాలిటీలు ఉంటాయి. ఆక్టేన్ 91, 92, 95, 97, 99, 100 ఇలా క్వాలిటీలుంటాయి. సాధారణంగా అన్ని వెహికల్స్ లో వాడే పెట్రోల్ ఆక్టేన్ 91. ఇది అన్ని పెట్రోల్ బంకుల్లో దొరుకుతుంది.  పవర్ పెట్రోల్ ఆక్టేన్ 92 ఇండియన్ ఆయిల్​ ఫిల్లింగ్ స్టేషన్లలో, ఆక్టేన్ 95 హిందూస్థాన్​ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్లలో ఉంటుంది. భారత్ పెట్రోలియం బంకుల్లో ఆక్టేన్ 97 పవర్ పెట్రోల్ ఉండగా....మూడేండ్ల క్రితమే హెచ్ పీ సంస్థ ఆక్టేన్ 99 ని అందుబాటులోకి తెచ్చింది. వీటి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. వీటన్నింటి కన్నా మరింత క్వాలిటీ అయిన పెట్రోలే ఆక్టేన్ 100. కానీ 2 నెలల క్రితం వరకు కూడా మన దగ్గర ఈ పెట్రోల్ లేకుండే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిటీలో జూబ్లీహిల్స్, హైటెక్ సిటీల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఆక్టేన్ 100ను అందుబాటులోకి తెచ్చింది. సౌత్ ఇండియాలోనే ఈ క్వాలిటీ పెట్రోల్ ను ముందుగా మన దగ్గరే స్టార్ట్ చేయటం విశేషం. 

31 సిటీల్లోనే 

గతంలో  విదేశాల్లో మాత్రమే ఈ పెట్రోల్ ను వాడేవారు. మన దగ్గర పెద్దగా అందుబాటులో లేదు. ఇప్పటికీ  దేశం మొత్తంలో 31 సిటీల్లో 79 బంకుల్లో ఈ పెట్రోల్ ను అమ్ముతున్నారు. అత్యధిక ఫిల్లింగ్ స్టేషన్లు ఢిల్లీలో 15 ఉన్నాయి. సౌత్ ఇండియాలో 2 నెలల కిందటే అమ్మకాలు స్టార్ట్ చేశారు. అంతకుముందు లగ్జరీ కార్ల కోసం ఆక్టేన్ 99ను వాడేవారు.  ఆక్టేన్ 100 అందుబాటులోకి వచ్చాక ఆక్టేన్ 99 సేల్స్ 50 శాతం తగ్గిందని ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వాహకులు చెప్తున్నారు. ఆక్టేన్ 100 ను యూపీలోని మథాని నుంచి హైదరాబాద్ కి సప్లయ్ చేస్తున్నారు. బుక్ చేసిన 4 రోజులకు ట్యాంకర్ వస్తుంది. ఇటీవల డిమాండ్ పెరగటంతో నెలకు 20 వేల లీటర్ల ట్యాంకును తెప్పిస్తున్నారు. సాధారణ పెట్రోల్ వాడుతూనే ఆక్టేన్ 100 కూడా ఎప్పుడంటే అప్పుడు వాడొచ్చని,ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని ఫిల్లింగ్ స్టేషన్ల  నిర్వాహకులు చెప్తున్నారు, 

క్యూ కడుతున్నరు

ఆక్టేన్ 100 పెట్రోల్ వాడకం బాగా పెరిగింది. లగ్జరీ కార్లు వాడే వారు ఇలాంటి పెట్రోల్ నే ఫిల్ చేయించుకుంటారు.  2 నెలల క్రితమే సిటీలో ఈ పెట్రోల్ అమ్మకాలు మొదలైనయ్. దీంతో చాలామంది బంకు దగ్గర క్యూ కడుతున్నరు. ఈ పెట్రోల్ ను కొట్టిస్తే ఇంజన్ స్మూత్ గా ఉండటంతో పాటు వెహికల్ కండిషన్ బాగుంటుంది.

- సింగిరెడ్డి భరత్ రెడ్డి, మేనేజర్, జూబ్లీహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్

ఫుల్ డిమాండ్ 

పెట్రోల్ ధర రూ. 160 అయిన దీనికి ఫుల్ డిమాండ్ ఉండటం విశేషం. లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్స్, హై ఎండ్ మోడల్ కార్లల్లో ఈ పెట్రోల్  వాడితే బండ్లు స్మూత్ గా ఉండటంతో పాటు కండిషన్ లో ఉంటాయి. పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ వెహికల్స్ కొంటున్న వారు ఈ పెట్రోల్​ వాడకానికే ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. రెండు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు.  మొదట్లో డైలీ100 లీటర్లు మాత్రమే సేల్ అయ్యేదని వీకెండ్ లో కాస్త ఎక్కువగా అమ్మకాలు జరిగాయని ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వాహకులు  చెప్తున్నారు. ప్రస్తుతం డైలీ500 లీటర్లు, వీకెండ్ లో వెయ్యి లీటర్ల సేల్ ఉంటోందంటున్నారు.  హర్లీ డేవిడ్​సన్, ఆస్టిన్ మార్టిన్, రోల్స్ రాయిస్, ఫెరారీ, లంబోర్గిని, బెంజ్, బీఎండబ్ల్యూ వంటి హై ఎండ్ లగ్జరీ కార్లు, బైక్​లకు ఆక్టేన్ 100ను ఫిల్ చేయించుకునే వారి సంఖ్య పెరిగిందంటున్నారు.