ఫ్యాన్సీ నంబర్లతో  సర్కార్ కు మస్తు​ ఆదాయం

ఫ్యాన్సీ నంబర్లతో  సర్కార్ కు  మస్తు​ ఆదాయం
  •     ఇప్పటి దాకా సర్కారుకు​రూ.300 కోట్ల రాబడి
  •     టార్గెట్ రూ.130 కోట్లు క్రాస్
  •     పోయిన ఏడాది రూ.106 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్‌ రాష్ట్ర సర్కారుపై కాసులు కురిపిస్తున్నది. లక్కీ నంబర్‌, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని వాహనదారులు లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఏకంగా కోట్ల రూపాయల్లో రాబడి వస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.106 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.130 కోట్ల ఆదాయాన్ని ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకున్నది.  ఇప్పటికే ఫ్యాన్సీ నంబర్లతో ప్రభుత్వానికి దాదాపు రూ.300 కోట్ల ఆదాయం వచ్చింది. ఉద్యోగులు, వ్యాపారులు, సినీ నటులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు వంటి భిన్న రంగాలకు చెందినవారు లక్కీ నంబర్ల కోసం ఎగబడుతున్నారు. అదృష్ట సంఖ్యలుగా భావించే ఈ నంబర్ల కోసం కొందరు పోటీపడుతుంటే.. సామాజిక హోదా కోసం, పేరు కోసం మరికొందరు పోటీపడుతున్నారు.  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. ఈ నంబర్ల కోసం వేల మంది పోటీపడుతున్నారు. ఇక జ్యోతిష్యం ప్రకారం న్యూమరాలజీ  ఫాలో అవుతూ కొందరు ఫ్యాన్సీ నంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో ఆన్‌లైన్‌  వేలంలో  టీఎస్‌ 09 ఎఫ్‌జడ్‌ 9999 నంబర్‌కు ప్రీమియర్‌  ఇన్‌ఫోసిటీ ప్రైవేట్‌  లిమిటెడ్‌ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించింది. సీఎం కేసీఆర్​ తన కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ వాడుతున్న ఫ్యాన్సీ నంబర్‌  6666. ఈ సంఖ్యకు ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పోటీ ఉంది. నిరుడు సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌  బిడ్డింగ్‌లో టీఎస్‌ 09 ఎఫ్‌ఎక్స్‌ 9999 నంబర్‌  ఏకంగా రూ.13.50 లక్షలు పలికిందని అధికారులు తెలిపారు.