హైదరాబాద్: మైలార్ దేవ్ పల్లిలో టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలార్ దేవ్ పల్లిలోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న సుమిత్ టింబర్ డిపో, బి.డి. ప్లైవుడ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టింబర్ డిపోలో చెక్కలు మంటలు అంటుకుని తగలబడటంతో కార్మికులు మంటలను అదుపు చేయలేకపోయారు.
మంటలు అక్కడే ఉన్న దుంగలు, కట్టెలకు వేగంగా వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రెండు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా గోదాములు నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటేదాన్ ప్రాంతంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
