మాస్క్ ధరించని మంత్రి..ఫైన్ వేసిన అధికారులు

మాస్క్ ధరించని మంత్రి..ఫైన్ వేసిన అధికారులు

చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపిస్తున్నారు అధికారులు. ఓ మంత్రి మాస్క్ ధరించలేదు. దీంతో అధికారులు రూ.200 ఫైన్ విధించారు.  వైరస్ కారణంగా సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు జీవన విధానంలో మాస్క్ అనేది ఓ భాగమైంది. దీంతో మాస్క్ ధరించని వారిపై ఫైన్ల రూపంలో శిక్ష విధిస్తున్నారు. ఆ శిక్ష సామాన్యులకే కాదండోయ్..ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందని చెబుతున్నారు.  తాజాగా గుజరాత్ సీఎం విజయ్ రూపాని కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఈశ్వర్ సిన్హా పటేల్ హాజరయ్యారు. అయితే నిబంధనల ప్రకారం మాస్క్ ధరించాలి. కానీ ఈశ్వర్ సిన్హా మాస్క్ ధరించలేదు. నిబంధనల ప్రకారం మాస్క్ లేకుండా రావడంతో అధికారులు ఆయనకు ఫైన్ వేశారు. దీంతో తన తప్పు తెలుసుకొని జరిమానా చెల్లించి రసీదు తీసుకున్నారు. దీన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో అది వైరల్ అయింది. వాస్తవానికి తాను మాస్కును ఎప్పుడూ ధరించే ఉంటానని… అయితే, కారు దిగే సమయంలో మర్చిపోయానని ఆయన వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా అధికారులు స్పందించిన తీరుకు ఆయన వారిని ప్రశంసించారు. కాగా ఈ సమావేశానికి వచ్చిన మంత్రులంతా విధిగా మాస్కులు ధరించి రాగా ఈశ్వర్ సిన్హా ఒక్కరే మర్చిపోయారు.