ఎన్ని మందులు వాడినా లొంగకుండా మొండిబారిపోతోంది టీబీ. యాంటీబయాటిక్‌లు తరచూ వాడితే ఫర్వాలేదుగానీ, ఒక్కసారి ఆపేస్తే టీబీ ప్రభావం పెరిగిపోతుంటుంది. ఇలాంటి బాధలకు చెక్‌పెట్టే కొత్త వ్యాక్సిన్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ సైంటిస్టులు కనుగొన్నారు. ఇప్పటికే టీబీ మహమ్మారికి (బీసీజీ– బేసిల్లి కాల్మెటి గ్వెరిన్) వ్యాక్సిన్ ఉన్నా, తాము తయారు చేసింది మాత్రం కొత్త తరహా వ్యాక్సిన్ అని సైంటిస్టులు చెబుతున్నారు. మామూలుగా వ్యాక్సిన్‌ను చర్మం ద్వారా ఇస్తారు. కానీ, ఇప్పుడు సైంటిస్టులు తయారు చేసింది ఐవీ వ్యాక్సిన్. పాత బీసీజీ వ్యాక్సిన్నే కొత్తగా రక్తనాళాల ద్వారా ఇచ్చేందుకు మోడిఫై చేశారు. దానివల్ల మందు రక్తంలోకి నేరుగా పోవడం వల్ల ఫలితం వేగంగా వస్తుందని చెబుతున్నారు. ఆ వ్యాక్సిన్‌ను కోతులపై ప్రయోగించి సక్సెస్ అయ్యారు. పదిలో తొమ్మిది కోతులకు టీబీ నయమైందని తేల్చారు. లక్ష రెట్లు ఎక్కువ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. టీబీ ఉన్న కోతులను ఆరు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్‌ను పరీక్షించామని సైంటిస్టులు చెప్పారు. వ్యాక్సిన్ వేయని కోతులు, మామూలు ఇంజెక్షన్ వేసినవి, ఎక్కువ డోస్ ఇంజెక్షన్ ఇచ్చినవి, మిస్ట్, మిస్ట్ ప్లస్ ఇంజెక్షన్, ఐవీ ద్వారా బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన కోతులుగా విభజించి పరీక్షించారు. వీటన్నింటితో పోలిస్తే రక్తనాళాల ద్వారా బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని గుర్తించారు.
