V6 News

అశ్విన్ ఓ జీనియస్ బౌలర్

అశ్విన్ ఓ జీనియస్ బౌలర్

ప్రస్తుత వరల్డ్ క్రికెట్ లో పదునైన పేస్ బౌలింగ్ దళాల్లో ఒకటిగా టీమిండియా పేరు తెచ్చుకుంది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీతోపాటు కుర్రాళ్లు నవదీప్ సైనీ, మహమ్మద్ సిరాజ్ అండతో టెస్టుల్లో బెస్ట్ పేస్ అటాక్ గా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. వీరికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి దీటైన స్పిన్నర్లు తోడవడంతో మనతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాలో కీలకమైన స్పిన్నర్ గా, అవసరమైతే బ్యాటింగ్ లో సత్తా చాటుతూ పేరు తెచ్చుకున్న అశ్విన్ పై పాక్ సీనియర్ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసల జల్లులు కురిపించాడు. అశ్విన్ ఓ జీనియస్ బౌలర్ అని.. అతడి లాంటి వాళ్లు క్రికెట్ లో అరుదని మెచ్చుకున్నాడు.  

'అశ్విన్ అద్భుతమైన ఆఫ్ స్పిన్నర్. అతడి వైవిధ్యత అపూర్వం. బంతిని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఫ్లోట్ చేయడం, స్పిన్ చేయడాన్ని తెలివితో కూడిన టాలెంట్ అనొచ్చు. ఇలాంటి ప్లేయర్లు చాలా అరుదు. కాబట్టి వారిని గౌరవించడం నేర్చుకోవాలి. దూస్రా కోసం కొందరు బౌలర్లు చేతిని తక్కువగా వంచడం లాంటివి చేశారు. కాబట్టి ఇప్పుడు కొత్త జనరేషన్ కు ఒక ఆఫ్ స్పిన్నర్ ను ఉదాహరణగా చూపాలంటే అశ్విన్ నే చూపించాలి' అని రమీజ్ రాజా పేర్కొన్నారు.