ఒక టైగర్​ షార్క్​ వాంతితో బయటికొచ్చిన నిజం

ఒక టైగర్​ షార్క్​ వాంతితో బయటికొచ్చిన నిజం

తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక చిన్న ఆధారంతో పెద్ద పెద్ద క్రిమినల్​ కేసులు సాల్వ్​ అవుతుంటాయి. అలాగే ఒక టైగర్​ షార్క్​ వాంతి చేసుకోవడం వల్ల జిమ్మీ అనే వ్యక్తి చనిపోయినట్టు తెలిసింది. అదెలా అంటే.. ఆ షార్క్ వాంతి చేసుకున్నప్పుడు జిమ్మీ ​​ చెయ్యి బయటికి వచ్చింది. కానీ.. అతను ఎలా చనిపోయాడు? అతని చెయ్యి షార్క్​ కడుపులోకి ఎలా వెళ్లింది? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. 

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కూగీ బీచ్​లో బెర్ట్ హాబ్సన్​కు అక్వేరియం, స్విమ్మింగ్ బాత్‌‌ సర్వీసులు అందించే  ఒక చిన్న కంపెనీ ఉండేది. 1935లో అతని బిజినెస్​ బాగా తగ్గింది. ఇక నష్టాలు తప్పవని, లాభాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు బెర్ట్ హాబ్సన్.  ఆ టైంలోనే బీచ్​ల్లో షార్క్​(సొరచేప)లు దాడులు చేస్తున్నాయనే వార్తలు చాలా వినిపించాయి. షార్క్​లను మాన్​ ఈటర్లు అనుకునేవాళ్లు. దాంతో సిడ్నీ వాసులు షార్క్‌‌లంటే భయపడ్డారు. కానీ.. వాటిని చూడడానికి చాలామంది ఇష్టపడేవాళ్లు. అందుకే ​ బెర్ట్ హాబ్సన్ ఒక ప్లాన్​ వేశాడు. తన కొడుకు రాన్‌‌తో కలిసి కూగీ బీచ్‌‌లో చేపలు పట్టేటప్పుడు ఒక షార్క్​ అతని ఫిషింగ్ లైన్‌‌లో చిక్కుకుంది. అది 14-అడుగుల పొడవు, 1-టన్ను బరువు ఉంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఒక పెద్ద అక్వేరియంలో ఆ టైగర్ షార్క్​ని ఉంచాడు. దాంతో ఆ షార్క్​ను చూడడానికి జనాలు ‘క్యూ’ కట్టారు. దాన్ని సముద్రంలో నుంచి పట్టి తీసుకొచ్చిన వారం రోజుల్లో బాగా నీరసంగా మారింది. దాని పవర్​, ఆకలి మునపటిలా లేవు. ఏప్రిల్ 17, 1935న అక్వేరియంలో నిదానంగా కదులుతుంది. ఒక్కసారిగా అక్వేరియం గోడలను ఢీకొని ట్యాంక్‌‌లో మునిగిపోయింది. ఈదడానికి కూడా ఇబ్బంది పడింది. అందరూ కంగారుగా దాని వైపే చూస్తున్నారు. కొద్దిసేపటికే అది వాంతి​ చేసుకుంది. అప్పుడు మనిషి చెయ్యి, ఒక పక్షి, ఎలుక బయటపడ్డాయి. చెయ్యిని చూసి అందరూ భయపడ్డారు. 

షార్క్​ చంపిందా? 

ఆ చేతిని చూసిన వాళ్లంతా ఆ షార్క్​ని అసహ్యించుకున్నారు. అది ఎవరినో చంపి తినేసింది అనుకున్నారు. వెంటనే బెర్ట్​ పోలీసులకు ఇన్ఫర్మేషన్​ ఇచ్చాడు. పోలీసులు కేసు ఫైల్​ చేసి, ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఫోరెన్సిక్​ రిపోర్ట్​లో ఆ చెయ్యిని షార్క్​ కొరకలేదని, మనిషి బాడీ నుంచి కత్తితో నరికిన తర్వాతే షార్క్​ మింగేసిందని తెలిసింది. ఆ చెయ్యి తెగిన చోట షార్క్​ పంటి గాట్లు లేవు. కానీ.. కత్తితో నరికిన ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఆ హత్యకు షార్క్​ ఎవిడెన్స్​గా రికార్డ్​ రాశారు. తర్వాత ఆ చేతి వేళ్ల ముద్రలు, దానిపై ఉన్న బాక్సింగ్ పచ్చబొట్టు ఆధారంగా ఆ చెయ్యి ఎవరిదో కనిపెట్టారు. 

బాక్సర్ల టాటూ.. 

ఆ చెయ్యి పైన ఇద్దరు బాక్సర్లు ఒకరినొకరు ఎదుర్కొంటున్నట్లు ఉన్న టాటూ ఉంది. ఈ విషయం వార్తల్లో వచ్చింది. ఆ వార్తని ఎడ్విన్ స్మిత్ చదివి ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే.. తన తమ్ముడు జిమ్మీకి కూడా అదే ప్లేస్​లో అలాంటి టాటూ ఉంది. అతను కొన్ని వారాల నుంచి కనిపించడం లేదు. వెంటనే ఎడ్విన్​ పోలీసులకు విషయం చెప్పాడు. జిమ్మీ ఆస్ట్రేలియాలోని గ్లాడెస్‌‌విల్లేలో ఉండేవాడు. అక్కడే బార్‌‌ నడిపేవాడు. అతనికి క్రిమినల్​ రికార్డ్​ కూడా ఉంది. పోలీసు ఇన్‌‌ఫార్మర్‌‌గా కూడా పనిచేశాడు. కొన్నాళ్ల పాటు బాక్సింగ్​ ప్రాక్టీస్​ చేశాడు. చివరికి రెజినాల్డ్ హోమ్స్​కి చెందిన బోట్-బిల్డింగ్ కంపెనీలో పనిచేశాడు. హోమ్స్​ ఆ కంపెనీని అడ్డుపెట్టుకుని చట్టవిరుద్ధమైన పనులు చేశాడు. తన స్పీడ్ బోట్స్​లో డ్రగ్స్‌‌ తీసుకొచ్చి సిటీలో అమ్మేవాడు. అంతేకాదు.. ఫోర్జరీ, ఇన్సూరెన్స్ స్కామ్‌‌లు కూడా చేశాడు. ఇవన్నీ జిమ్మీ, తన ఫ్రెండ్​ పాట్రిక్ బ్రాడీతో కలిసి చేసేవాడు. 

అసలేం జరిగింది? 

హోమ్స్ కంపెనీకి చెందిన ఒక షిప్​కి ఇన్సూరెన్స్​ చేయించి, కావాలనే దాన్ని సముద్రంలో ముంచేశారు. నష్టపరిహారంగా చాలా డబ్బు వచ్చింది. ఆ డబ్బు విషయంలో జిమ్మీకి హోమ్స్​తో గొడవైంది. స్మిత్ చివరిసారిగా ఏప్రిల్ 7న రాత్రి సిసిల్ హోటల్‌‌లో పాట్రిక్ బ్రాడీతో కలిసి మందు తాగుతూ, కార్డ్స్​ ఆడాడు. తర్వాత అక్కడి నుంచి వాళ్లు అద్దెకు ఉంటున్న కాటేజీకి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్రాడీ తన ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత జిమ్మీకి ఏం జరిగిందనేది ఇప్పటికీ రహస్యమే. ఈ కేసు కోసం పోలీసులు చాలా రోజులు ఇన్వెస్టిగేట్​​ చేశారు. కానీ.. నేరస్తులను పట్టుకోలేకపోయారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది కూడా స్పష్టంగా తెలియలేదు.  బ్రాడీ హత్య చేశాడు అనడానికి కావాల్సిన ఆధారాల్లేవు. అందుకే ఈ కేసుకు సంబంధం లేని మరో ఫోర్జరీ కేసులో భాగంగా బ్రాడీని అరెస్ట్​ చేశారు. ఆరు గంటల పాటు ఇంటరాగేట్​ చేశారు. అప్పుడు బ్రాడీ.. జిమ్మీని హోమ్స్​ చంపాడని చెప్పాడు. 

మరో కథ..

కొన్ని రోజులకు పోలీసులు హోమ్స్​ని పట్టుకోగలిగారు. కానీ.. అతను మాత్రం మరో కథ చెప్పాడు. జిమ్మీని చంపింది బ్రాడీ అని చెప్పాడు. అంతేకాదు.. జిమ్మీ చెయ్యిని తనకు పంపి, తనను కూడా బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. దాంతో భయంతో ఆ చెయ్యిని సముద్రంలో పారేశానన్నాడు. ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసినా.. ఇద్దరూ అందుకు సరిపోయే ఆధారాలు చూపించలేకపోయారు. అందుకే పోలీసులు ఈ కేసును తేల్చలేకపోయారు.