కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్​ను పిలిచి సమాచారం తీస్కుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్​లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్​లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ ప్రారంభించారు.

ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్​

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదులు, సలహాలను తీస్కునేందుకు రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ సలహాలు చెప్పొచ్చని గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్​లో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ‘‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 ప్రకారం వచ్చిన అధికారాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్​గా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ, నాణ్యత, నిర్వహణ లోపాలను వెలికితీసి బాధ్యులను గుర్తించేలా కమిషన్​ను నియమించాం.

మూడు బ్యారేజీల నిర్మాణంలోని నిధుల దుర్వినియోగంపైనా కమిషన్ విచారణ చేస్తున్నది. దీనిపై ప్రజలు కూడా తమ సలహాలు, అభిప్రాయాలు, ఫిర్యాదులు చేయొచ్చు. సాక్ష్యాధారాలు, నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో అభిప్రాయాలను సమర్పించాలి. బీఆర్కే భవన్​లోని 8వ ఫ్లోర్​లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్ వద్ద పెట్టిన స్పెషల్ బాక్సుల్లో మే 31 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేయొచ్చు. పోస్టు ద్వారా కూడా అఫిడవిట్లను బీఆర్కే (8వ ఫ్లోర్​)కు పంపించొచ్చు. అయితే, సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా నోటరీ జత చేయకుండా పంపిన ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోం’’అని నోటిఫికేషన్​లో రాహుల్ బొజ్జా పేర్కొన్నారు.