ఊరుగొండ వద్ద గ్రీన్ ఫీల్డ్ బాధితుల ధర్నా

ఊరుగొండ వద్ద  గ్రీన్ ఫీల్డ్ బాధితుల ధర్నా
  •  రోడ్డు అలైన్​మెంట్​ మార్చాలంటూ
  •  పురుగుల మందు డబ్బాలతో రైతులు, కుటుంబసభ్యుల నిరసన 
  •  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ఆత్మకూరు (దామెర), వెలుగు: హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే బాధిత రైతులు గురువారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఊరుగొండ, మొగుళ్లపల్లి, వెల్లంపల్లి, పోచారం గ్రామాలకు చెందిన 40 మంది రైతులు తమ కుటుంబాలతో కలిసి పురుగుల మందు డబ్బాలు పట్టుకొని వచ్చారు. ఒక దశలో పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని పొలాల నుంచి వేస్తున్న రోడ్డు అలైన్ మెంట్ మార్చాలని కేంద్ర ప్రభుత్వాడిమాండ్​ చేశారు. 

నాగ్​పూర్​ నుంచి విజయవాడకు వేసే ఈ రోడ్డు నేషనల్ హైవే 163 మీదుగా వేయాలని విజ్ఞప్తి చేశారు. బువ్వ పెట్టే భూములను కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్రం తమను పట్టించుకోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ను బ్రౌన్ ఫీల్డ్ హైవే చేయాలంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఆందోళనతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వారికి నచ్చజెప్పారు. ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడుకోవాలని, వినకపోతే అరెస్ట్ ​చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో ధర్నా విరమించారు.