
- ప్రస్తుతం 100కు పైగా చట్టాలు.. ఇక అవన్నీ ఒకే గొడుగు కిందకు..
- క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దులు ఏర్పాటు
- పక్కా విస్తీర్ణంతో రైతులకు పాస్ బుక్స్
- కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయం
- త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతున్నది. ఇప్పుడున్న భూచట్టాలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చి, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నది. ఉత్తరప్రదేశ్ తరహాలో మన రాష్ట్రంలోనూ కామన్ రెవెన్యూ కోడ్ అమలు చేస్తే, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నది. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ధరణి కమిటీ ప్రతిపాదనలు చేయనున్నట్టు తెలిసింది.
అలాగే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో రైతుల భూములకు హద్దులు నిర్ణయించడంతో పాటు పక్కా విస్తీర్ణంతో పాస్బుక్లు జారీ చేయాలని కమిటీ అభిప్రాయపడుతున్నది. అదే విధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని పేర్కొంటున్నది. త్వరలోనే ఈ సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది.
అలాగే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో రైతుల భూములకు హద్దులు నిర్ణయించడంతో పాటు పక్కా విస్తీర్ణంతో పాస్ బుక్ లు జారీ చేయాలని కమిటీ అభిప్రాయపడుతున్నది. అదే విధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని పేర్కొంటున్నది. త్వరలోనే ఈ సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది. అయితే ఇవన్నీ వెంటనే అమలు చేయాలా? లేదంటే మరింత అధ్యయనం తర్వాత తీసుకురావాలా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు భూములకు సంబంధించి అసైన్డ్, ఇనాం, రక్షిత కౌలుదారు, ప్రభుత్వ భూములు.. ఇలా ఒక్కో కేటగిరీకి ఒక్కో విధంగా 100కు పైగా చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రధానంగా ప్రస్తావించనుంది.
1999లోనే ప్రయత్నాలు..
ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూనే, కొత్త రెవెన్యూ చట్టం అమలుతో పాటు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కామన్రెవెన్యూ కోడ్పేరుతో కొత్త చట్టం తీసుకురావడం ద్వారా భూసమస్యలకు చెక్ పెట్టవచ్చని ధరణి కమిటీ పేర్కొంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ 196 చట్టాలను ఏకీకృతం చేస్తూ ‘ఏపీ ల్యాండ్ రెవెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టారు.
రాష్ట్రపతి ఆమోదం కోసం ఆ ఫైల్ ను ఢిల్లీకి పంపారు. కానీ ఆ తర్వాత ఆ ఫైలు మూలనపడ్డది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ‘తెలంగాణ కామన్ రెవెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టాలని ధరణి కమిటీ భావిస్తున్నది. ఈ కోడ్ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానంలో ఒకే చట్టం అందుబాటులోకి రానుంది. పీఓటీ, ఇనాం, రక్షిత కౌలుదారు, భూఆక్రమణ, భూదురాక్రమణ, ఎల్‌టీఆర్, అసైన్డ్, సర్వే, హద్దులు.. ఇలా దేనికది కాకుండా ఏదైనా ఒక క్రమ పద్ధతిలో చేయాలని ధరణి కమిటీ ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.
తలాతోక లేకుండా రెవెన్యూ యాక్ట్..
ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ చట్టం–2020ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇది తలాతోక లేకుండా ఉందని ధరణి కమిటీ సభ్యులు అంటున్నారు. ఈచట్టం ఆధారంగా ధరణిలో మార్పులకు శ్రీకారం చుట్టగా, సమస్యల పరిష్కారం సాధ్యం కాలేదు. ధరణి వల్ల ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్భూములతో పాటు రైతుల ల్యాండ్ రికార్డులు ఆగమయ్యాయి.
సమస్యల పరిష్కారం అటుంచితే, కొత్త సమస్యలు ఎక్కువగా వచ్చాయి. దీంతో ధరణిలో అనేక రకాల మాడ్యుల్స్ పేరుతో గత మూడేండ్లుగా మార్పులు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం ఉండటం లేదు. సీసీఎల్ఏ, సర్వే సెటిల్మెంట్, రిజిస్ర్టేషన్స్ తదితర డిపార్ట్మెంట్ల కింద ఉన్న ల్యాండ్స్వేటికవి సంబంధం లేకుండా ఉన్నాయి. పైగా ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ చట్ట ప్రకారం ధరణిలో ఉన్న భూముల డేటాలో మార్పులకు ఎవరికి అధికారం ఇవ్వలేదు. ఇందులో ఎమ్మార్వోలను జాయింట్సబ్ రిజిస్ర్టార్లుగా చేర్చారు.
కొనుగోళ్లు, అమ్మకాలు, కోర్టు నుంచి వచ్చే ఆదేశాలతో మాత్రమే మార్పులు చేసేందుకు అధికారాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ధరణిలో వివిధ సమస్యలకు వచ్చిన అప్లికేషన్లకు ఎమ్మార్వో రిపోర్ట్ఆధారంగా కలెక్టర్, సీసీఏల్ఏ వరకు వచ్చి అప్రూవల్తీసుకుంటున్నారు. ఇదంతా చట్టంలో లేకుండానే కేవలం సర్క్యులర్ ద్వారా చేసుకుంటూ వస్తున్నారు.