CSK vs PBKS: చెన్నైపై విజయంతో టాప్-2లోకి పంజాబ్.. ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా ధోనీ సేన ఔట్

CSK vs PBKS: చెన్నైపై విజయంతో టాప్-2లోకి పంజాబ్.. ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా ధోనీ సేన ఔట్

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో పంజాబ్ విఫలమైనా ఛేజింగ్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 72:5 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రభ్‌సిమ్రాన్‌ (36 బంతుల్లో 54:5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి పంజాబ్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరగా.. 8 పరాజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి గెలిచింది.          

191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య,ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 4.4 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఆర్య (23) ఔటైనా..ప్రభ్‌సిమ్రాన్‌.. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రెండో వికెట్ కు 72 పరుగులు జోడించి పంజాబ్ ను విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసుకున్న  ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్ 36 బంతుల్లో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. 

కాసేపటికే నెహ్యాల్ వధేరా (5) ఔటవ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే శ్రేయాస్ ఈ ఆనందాన్ని చెన్నైకి ఎక్కువ సేపు మిగిల్చలేదు. శశాంక్ సింగ్ (23) తో కలిసి చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ మ్యాచ్ చెన్నై దగ్గర నుంచి లాగేసుకున్నాడు. పతిరానా వేసిన 17 ఓవర్లో 20 పరుగులు రావడంతో పంజాబ్ విజయం ఖరారైంది. అయ్యర్ 42 బంతుల్లోనే 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై బౌలర్లలో పతిరానా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా,నూర్ అహ్మద్ లకు తలో వికెట్ దక్కింది. 

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా సామ్ కరణ్ (47 బంతుల్లో 88:9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్ (32)  భారీ భాగస్వామ్యంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జాన్సెన్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఓమార్జాయి, హరిప్రీత్ బ్రార్ తలో వికెట్ తీసుకున్నారు.