ట్రంప్ రిసార్ట్‎లో కాల్పుల కలకలం: దుండగుడిని కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్

ట్రంప్ రిసార్ట్‎లో  కాల్పుల కలకలం: దుండగుడిని కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్

వాషింగ్టన్: ఫ్లోరిడా రాష్ట్రం వెస్ట్ పామ్ బీచ్‌లోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో కాల్పుల కలకలం రేగింది. ఆయుధాలు ధరించిన ఓ ఆగంతకుడు ట్రంప్ రిసార్ట్‎లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. 

వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ రిసార్ట్‎లో లేరని అధికారులు వెల్లడించారు. మృతుడిని నార్త్ కరోలినాకు చెందిన 20 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘2026, ఫిబ్రవరి 22 తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ప్రెసిడెంట్ ట్రంప్ మార్-ఎ-లాగో రిసార్ట్‎లోకి అనధికారికంగా ప్రవేశించిన  20 ఏళ్ల యువకుడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం (PBSO) అధికారులు కాల్చి చంపారు. దుండగుడు స్పాట్‎లోనే చనిపోయాడు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీసెస్ అధికారులకు ఎలాంటి గాయాలు కాలేదు” అని ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై ఎఫ్‎బీఐ, యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ దర్యాప్తు చేస్తోన్నట్లు అధికారులు తెలిపారు.