భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ .! నీటి కష్టాలు మొదలైనట్టేనా.!.

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ .!  నీటి కష్టాలు మొదలైనట్టేనా.!.

జమ్మూకాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందం(ఇండస్ వాటర్స్ ట్రీటీ) రద్దు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ లోకి ప్రవహించే  చీనాబ్ నదిలో నీటి ప్రవాహం తగ్గినట్లు శాటిలైట్ ఫోటోల్లో కనిపిస్తోంది.  చాలా కాల్వలు ఎండిపోతున్నట్లు భారత సైన్యంలోని మిలిటరీ ఇంటెలిజెన్స్  కల్నల్ వినాయక్ భట్ (రిటైర్డ్) కొన్ని శాటిలైట్ ఫోటోలను తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.  సరిహద్దు వెంట ఉన్న సియాల్‌కోట్ ప్రాంతంలోని  మరాలా హెడ్‌వర్క్స్ దగ్గర  నీటి ప్రవాహం  గణనీయంగా  తగ్గిందని ఆయన వెల్లడించారు.

ఏప్రిల్ 21న  ఏప్రిల్ 26 తేదీలలో తీసిన రెండు శాటిలైట్ ఫోటోలను తన ఎక్స్ లో పోస్ట్ చేసిన కల్నల్ భట్ మారాలా  ప్రధాన్ కాల్వ నుంచి వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో నీటి ప్రవాహం తక్కువైనట్లు తెలుస్తోందన్నారు. అలాగే ఒక నది పూర్తిగా ఎండిపోయిందని.. ఈ ఫోటోల్లో కనిపిస్తున్న దాన్ని భట్టి ఐదు రోజుల్లోనే నది ప్రవాహాల్లో చాలా మార్పు కనిపిస్తోందని ట్వీట్ చేశారు.

సింధూ నది (ఇండస్ రివర్) టిబెట్‎లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3,180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కలుస్తుంటాయి. అయితే, దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో తలెత్తిన వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు

పాకిస్తాన్ లోని వ్యవసాయ భూముల్లో 80% (పంజాబ్, సింధు ప్రావిన్స్ లోనే ఉన్నాయి) భూములకు సింధు జలాలే కీలకం. ఈ రెండు ప్రావిన్స్ లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది (23.7 కోట్ల మంది) ఇండస్ బేసిన్ లోనే నివసిస్తున్నారు. 

కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నదీ వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అంతేకాకుండా తర్బెలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్ కు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండస్ బేసిన్ లో పండే గోధుమలు, వడ్లు, చెరకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, ఝీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్ లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. 

వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది. అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది. ఇండ్లకు, ఇండస్ట్రీలకు కరెంట్ సప్లైకి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి పడిపోతుంది. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్స్ లు కాలక్రమంలో ఎడారులుగా మారతాయని అంటున్నారు.  చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజల వలసపోయే పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు.