వాషింగ్టన్: ఇటీవల ఎన్నికలు జరిగిన న్యూయార్క్, వర్జీనియాలో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూయార్క్ మేయర్ పదవితో పాటు వర్జీనియా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవి కూడా ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో పడింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత జోహ్రాన్ మమ్దానీ రిపబ్లికన్ అభ్యర్థిపై ఘన విజయం సాధించి ట్రంప్‌కు షాక్ ఇచ్చాడు. మరోవైపు.. వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీకి ఓటమి ఎదురైంది. డెమొక్రట్ మహిళా నేత గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్‌గా గెలుపొందారు.
ఎన్నికల్లో వరుస ఓటములపై ట్రంప్ మద్దతుదారుల బృందం మాగా (Make America Great Again) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి, న్యూయార్క్‌లో మమ్దానీ విజయానికి ట్రంపే కారణమని మాగా సపోర్టర్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. విదేశీ రాజకీయాలపై ట్రంప్‌కు ఉన్న వ్యామోహంతో పాటు అమెరికాలోని ప్రధాన సమస్యలను విస్మరించడం వల్లే ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయని ట్రంప్ తీరును తప్పుబడుతున్నారు మాగా మద్దతుదారులు.
ట్రంప్ స్వదేశంలోని సమస్యల కంటే విదేశీ సమస్యలపైనే ఎక్కువ దృష్టి సారించారని విమర్శించారు. రిపబ్లికన్ల అంతర్గత కలహాలు కూడా ఓటమికి ఒక కారణమని మరికొందరు మాగా మద్దతుదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి, ట్రంప్ 2024 ప్రచార రాజకీయ డైరెక్టర్ జేమ్స్ బ్లెయిర్ కూడా ట్రంప్ దేశీయ సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో ఓడిందని అభిప్రాయపడ్డారు.
ఇకనైనా ట్రంప్ ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలపై అమితాసక్తి చూపడం ఆపేసి.. అమెరికన్ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని హెచ్చరించారు. జోహ్రాన్ మమ్దానీ విజయం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న అమెరికాకు ఎదురుదెబ్బ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ ఇజ్రాయెల్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.. గాజాలో ముస్లింలు ఆకలి చావులు న్యూయార్క్ లో మమ్దానీ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.
