హెయిర్ క‌ట్ చేయించుకోవాలంటే ఆధార్‌ తప్పనిసరి

హెయిర్ క‌ట్ చేయించుకోవాలంటే ఆధార్‌ తప్పనిసరి

క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం లాక్ డౌన్ నిబంధ‌న‌లను మ‌రింత‌ క‌ఠిన‌త‌రం చేసింది. అందులో భాగంగానే హెయిర్ కటింగ్ చేయించుకోవాలని అనుకునే వారు ఎవ‌రైనా సెలూన్‌కు వెళ్తే తప్పనిసరిగా వెంట ఆధార్ తీసుకెళ్లాలని సూచించింది. షాపులో ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు రిజిస్టర్ చేసిన తర్వాతనే కటింగ్ చేయించుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు వచ్చే ఖాతాదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను తీసుకోవాలని ఆదేశించింది. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లకు సూచనలతో కూడిన ఆదేశాలను ప్రభుత్వం విడుదల చేసింది.

సెలూన్‌కు వెళ్లే వారు ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ హెయిర్ కటింగులు చేయించుకోవాలని తెలిపింది. వారి పూర్తి వివ‌రాల‌ను సెలూన్ షాప్ లో ఇవ్వాల‌ని సూచించింది. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాల‌ని తెలిపింది. షాప్ లో ఏసీలు, ఎయిర్ కూలర్లు వాడరాదని అధికారులు పేర్కొన్నారు. హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని ఆదేశించారు. హెయిర్ కటింగ్ చేసే కార్మికులు చేతులకు హ్యాండ్ గ్లోజులు వేసుకోవాలన్నారు. శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలని సూచించారు.