ఐదో ఫేజ్​లో 58% పోలింగ్ .. ఆరు రాష్ట్రాలు, రెండు యూటీల్లో ఎన్నికలు

ఐదో ఫేజ్​లో 58% పోలింగ్ .. ఆరు రాష్ట్రాలు, రెండు యూటీల్లో ఎన్నికలు
  •  49 ఎంపీ స్థానాలకు ఓటింగ్ కంప్లీట్
  • బెంగాల్​లో హింసాత్మక ఘటనలు
  • బీజేపీ, టీఎంసీ నేతల మధ్య ఘర్షణ
  • ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలు
  • మహారాష్ట్ర, లడఖ్​లో లోక్​సభ ఎన్నికలు పూర్తి

న్యూఢిల్లీ: లోక్​సభ ఐదో ఫేజ్ ఎన్నికలు సోమవారం ముగిశాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 58 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కాగా, వెస్ట్ బెంగాల్​లో నిర్వహించిన ఏడు లోక్​సభ నియోజకవర్గాల్లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీఎంసీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు.

ఇక, మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యూపీలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు మొత్తం వెయ్యికి పైగా కంప్లైట్లు ఈసీకి అందాయి. ఐదో ఫేజ్​లో భాగంగా యూపీ (14), మహారాష్ట్ర (13), బెంగాల్ (7), బిహార్ (5), ఒడిశా (5), జార్ఖండ్ (3), జమ్మూ కాశ్మీర్​ (1), లడఖ్​(1)లో ఎన్నికల జరిగాయి. మహారాష్ట్రతో పాటు లడఖ్​లోని అన్ని లోక్​సభ స్థానాలకు ఐదో ఫేజ్​తోనే ఎలక్షన్ ప్రక్రియ ముగిసిందని ఈసీ ప్రకటించింది. కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

యూపీ గ్రామంలో ఎన్నికల బహిష్కరణ

యూపీ కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో గ్రామానికి చెందిన వేలాది మంది గ్రామస్తులు ఓటింగ్​ను బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పై స్పష్టమైన హామీ ఇచ్చే దాకా ఓటేసేది లేదని చెప్పారు. గ్రామంలోని చౌరస్తా వద్ద ఓటింగ్​ను బహిష్కరిస్తున్నట్టు పోస్టర్లు అతికించారు. రాయ్​బరేలీ సెగ్మెంట్​లోని సరేనీలో ఉదయం 8 గంటలకు ప్రజలు ఓటేసేందుకు వస్తే బీజేపీ నేతలు తిప్పి పంపారంటూ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.

బెంగాల్​లోని బ్యారక్​పోర్, బోన్​గావ్, ఆరంబాగ్ లోక్​సభ సెగ్మెంట్లలో పలు చోట్ల గొడవలు జరిగాయి. ఖానాకౌల్ ఏరియాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఒడిశాలో ఈవీఎంలు మొరాయించాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 40 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ చర్యలు తీసుకున్నది. జార్ఖండ్​లో ఓటేసేందుకు వెళ్తూ ఓ వృద్ధుడు గుండెపోటుతో చనిపోయాడు.

జార్ఖండ్​లో గ్రీన్ బూత్​లు

జార్ఖండ్​లోని కొడెర్మా జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ అధికారులు గ్రీన్ బూత్ లను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఝుమ్రీ తెల్హయ్య మున్సిపాలిటీలోని ఓల్డేజ్ హోమ్​లో 92, 93 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బూత్ మొత్తాన్ని వెదురు, వరి గడ్డితో డెకొరేట్ చేశారు. పర్యావరణాన్ని రక్షించాలనే మెసేజ్​ను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే గ్రీన్ బూత్ ఏర్పాటు చేశానని 58 ఏండ్ల సుదీప్ తెలిపాడు. ఓటింగ్​తో పాటు ఎన్విరాన్​మెంట్ కూడా ఎంతో ముఖ్యమన్నారు.

ఓటేసిన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు

బాంద్రాలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణే ఓటేశారు. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ హీరో హృతిక్‌‌‌‌ రోషన్‌‌‌‌ ఆయన తల్లిదండ్రులు రాకేశ్ రోషన్‌‌‌‌, పింకీ రోషన్‌‌‌‌  ఓటు హక్కు వినియోగించుకున్నారు. హేమామాలిని, ఆమె కూతురు ఈష కూడా ఓటేశారు. మనోజ్‌‌‌‌ బాజ్‌‌‌‌పాయ్‌‌‌‌, ధర్మేంద్ర, పరేశ్ రావల్‌‌‌‌, పూజా భట్, మహేశ్ భట్, అక్షయ్ కుమార్ తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. రాజకీయ నేతల్లో కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ లక్నోలో ఓటేశారు. అమేథిలో స్మృతి ఇరానీ, ముంబైలో పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌, లక్నోలో బీఎస్పీ చీఫ్‌‌‌‌ మాయావతి, శివసేన (యూబీటీ) చీఫ్‌‌‌‌ ఉద్ధవ్‌‌‌‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ, కొడుకు ఆదిత్య ఠాక్రే ఓటు హక్కు వినియోగించుకున్నారు.