చనిపోయాడని నమ్మించి పదేండ్లుగా పరారీ.. భార్యను చంపేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన వాజిద్‌‌‌‌

చనిపోయాడని నమ్మించి పదేండ్లుగా పరారీ.. భార్యను చంపేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన వాజిద్‌‌‌‌

కరీంనగర్, వెలుగు: చనిపోయాడని అందరినీ నమ్మించి, పదేండ్లుగా పరారీలో ఉన్న మోస్ట్‌‌‌‌ వాంటెడ్‌‌‌‌ క్రిమినల్‌‌‌‌, రేప్‌‌‌‌ కేసు నిందితుడిని కరీంనగర్‌‌‌‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ వాజిద్‌‌‌‌ అలియాస్‌‌‌‌ ధూమ్‌‌‌‌ ఖాలిద్‌‌‌‌ పదేండ్ల కింద ఓ ఇంజినీరింగ్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి చనిపోయాడనుకొని వదిలేసి వెళ్లారు. 

బంధువులు అతడిని హాస్పిటల్‌‌‌‌కు తరలించగా.. రెండు కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో వాటిని తీసేశారు. అతడు కోలుకున్న తర్వాత లైంగిక దాడి కేసులో పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేయడంతో కొన్నాళ్లు రిమాండ్‌‌‌‌లో ఉండి బెయిల్‌‌‌‌పై బయటకు వచ్చాడు. అప్పటికే అతడిపై కరీంనగర్‌‌‌‌ రూరల్ పీఎస్‌‌‌‌లో ఐదు, వన్‌‌‌‌టౌన్‌‌‌‌లో 2, టూ టౌన్‌‌‌‌లో ఒకటి, హైదరాబాద్‌‌‌‌లో పలు కేసులు నమోదయ్యాయి. 

లైంగిక దాడి కేసులో బెయిల్‌‌‌‌పై వచ్చిన ధూమ్‌‌‌‌ ఖలీద్‌‌‌‌ కరీంనగర్‌‌‌‌ నుంచి పరారయ్యాడు. మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌పూర్‌‌‌‌, నాందేడ్‌‌‌‌, చంద్రపూర్‌‌‌‌, బల్హార్ష తదితర ప్రాంతాల్లోని దర్గాల వద్ద భిక్షగాడి వేషంలో షెల్టర్‌‌‌‌ తీసుకున్నాడు. అక్కడ కొందరు యువకులతో ముఠాలు ఏర్పాటు చేసి చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌, గ్యాంగ్‌‌‌‌ రేప్‌‌‌‌, దారి దోపిడీలు చేయించేవాడు. ఈ క్రమంలో అతడిపై నాందేడ్, నాగపూర్, బల్హార్ష, చంద్రపూర్‌‌‌‌లోనూ కేసులు నమోదయ్యాయి. 

భార్యను చంపేందుకు వచ్చి.. పోలీసులకు చిక్కి..

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో నమోదైన క్రిమినల్‌‌‌‌ కేసుల్లో ధూమ్‌‌‌‌ ఖలీద్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసేందుకు పోలీసులు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి గురించి ఎంక్వైరీ చేయగా.. చాలా ఏండ్లుగా కనిపంచడం లేదని, చనిపోయాడని స్థానికులు చెప్పడంతో పోలీసులు సైలెంట్‌‌‌‌ అయ్యారు. కానీ హైదరాబాద్‌‌‌‌ సమీపంలోని మేడిపల్లి ప్రాంతంలో ఉంటున్న భార్యను చంపాలని ధూమ్‌‌‌‌ ఖలీద్‌‌‌‌ ఆరు నెలలుగా ప్రయత్నం చేస్తున్నాడని, ఇందుకోసం కరీంనగర్‌‌‌‌ ప్రాంతానికి వచ్చాడని పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ సీఐ నిరంజన్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు మొదలు పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్‌‌‌‌ విద్యార్థిపై లైందిక దాడి కేసులో అరెస్ట్‌‌‌‌ చేసి ర్టులో హాజరుపర్చారు. మిగతా కేసుల్లో కూడా అరెస్ట్‌‌‌‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పదేండ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న కరీంనగర్‌‌‌‌ రూరల్ సీఐ నిరంజన్‌‌‌‌రెడ్డితో పాటు పోలీస్‌‌‌‌ సిబ్బందిని సీపీ గౌష్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్  అభినందించారు.