కూల్ డ్రైవర్స్ కూల్.. ఇక నుంచి అన్నీ ఏసీ లారీలు.. ఏసీ ట్రక్కులు

కూల్ డ్రైవర్స్ కూల్..  ఇక నుంచి అన్నీ ఏసీ లారీలు.. ఏసీ ట్రక్కులు

కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. 2025 నుంచి తయారు చేసే అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో తప్పనిసరిగా ఏసీ ఉండాలని సూచించారు. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న ట్రక్కులోనూ ఏసీ క్యాబిన్లు ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీ ఆదేశించారు. 

డ్రైవర్లు శ్రమజీవులు..

దేశంలోని లారీ డ్రైవర్లు శ్రమజీవులని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు విశ్రాంతి లేకుండా స్టీరింగ్ సీట్లోనే కూర్చుంటారన్నారు. అలాంటి వారికి సౌకర్యవంతంగా ఉండేలా ట్రక్కులో డ్రైవర్ల క్యాబిన్లు తీర్చిదిద్దాలని ఆటో మొబైల్ కంపెనీలను నితిన్ గడ్కరీ ఆదేశించారు. 

డ్రైవర్లు అప్ గ్రేడ్ అవ్వాలి..

విదేశాల్లోని అనేక కంపెనీలు తయారు చేసే లారీల్లో ఇప్పటికే ఎయిర్ కండీషన్ క్యాబిన్లు ఉన్నాయని నితిన్ గడ్కరీ అన్నారు. కానీ దేశంలోని లారీల్లో మాత్రం ఏసీ క్యాబిన్లు లేవని చెప్పారు. ఇకనుంచైనా డ్రైవర్లు అప్‌గ్రేడ్ అవ్వాలని.. లారీల్లో డ్రైవర్ క్యాబిన్‌లో ఎయిర్ కండీషన్  తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం 18 నెలలు సమయం ఇస్తున్నామన్నారు. లారీ డ్రైవర్లు 43 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో విధులు నిర్వహిస్తుంటారని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే లారీ క్యాబిన్‌లో ఏసీ ఏర్పాటు చేసుకోవడం వల్ల  డ్రైవర్లు మరింత సౌకర్యవంతంగా నడుపుతారని చెప్పారు.  

క్యాబిన్లో ఏసీ ఏర్పాటుకు ఎంతవుతుందంటే..?

లారీల్లోని క్యాబిన్లలో ఏసీ ఏర్పాటు చేసుకోవడానికి భారీగా ఖర్చు అవుతుందన్న వార్తలను కేంద్ర రవాణా శాఖ కొట్టిపారేసింది. ట్రక్కుల్లో ఏసీ బిగించేందుకే కేవలం రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.